Mana Enadu: ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల పనులను ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే CM చంద్రబాబు పెండింగ్‌లో ఉన్న పనులపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే అర్హులందరికీ పెన్షన్లను పెంచింది. ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించి నిరుపేదల ఆకలి తీర్చుతోంది. తాజాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడితో భేటీ అయ్యార. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లిన ఆయన దాదాపు అరగంటకు పైగా పీఎంతో సమావేశమయ్యారు. వివిధ కీలక అంశాలు, రాష్ట్రానికి ఆర్థిక చేయూత, పెండింగ్ పనులకు బిల్లుల చెల్లింపులపై చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్లో అమరావతికి రూ.15వేల కోట్లు, జగన్ హయాంలో చేసిన రుణాలను రీ షెడ్యూల్ చేయాలని ఆయన ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది.
కేంద్రం తరఫున సహకారం
ఏపీలో విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త ఎయిర్ పోర్టుల పెంపుపై కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు, సంబంధిత అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షలు జరిపారు. ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాల అభివృద్ధితో పాటు కొత్తగా మరో 7 ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా చిన్న విమానాశ్రయాలను అభివృద్ధి చేయడానికి 500 నుంచి 700 ఎకరాల భూమి అవసరం పడుతుందన్నారు. అదే పెద్ద ఎయిర్‌పోర్టులకు మూడు వేలకు పైగా భూమి కావాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని విమానయాన శాఖ మంత్రి తెలిపారు. శ్రీకాకులం, దస్తగిరి, కుప్పం, నాగార్జున సాగర్ కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి భూమి, ఇతర సాంకేతిక అంశాలను పరిశీలిస్తామని అన్నారు.
మరోవైపు రాష్ట్రంలో హెలికాప్టర్ల వినియోగాన్ని భారీ స్థాయిలో పెంచే అవకాశాలను పరిశీలించాలని చంద్రబాబు సూచించారు. అలాగే ఏపీలో డ్రోన్ల వ్యవస్థను కూడా బాగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. ఇక రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా చేయడంలో ఎయిర్ పోర్టులు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్రమంత్రి వివరించారు.