Mana Enadu: ప్రస్తుతం రష్యా(Russia), ఉక్రెయిన్(Ukraine) మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటోంది. ఒక దేశం పేరెత్తితే మరో దేశానికి రక్తం మరిగిపోతుంది. మాటలతో కాదు.. యుద్ధంతోనే సమాధానమన్నట్లు ఒకరిపై ఒకరు దాడులు, ప్రతి దాడులు, ఆక్రమణలు.. ఇలాంటి సమయంలో శాంతిమంత్రం వేసేందుకు పెద్దన్న హోదా దేశాలు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ భారత ప్రధాని మోదీ(PM Modi) ఈ చిక్కుముడి విప్పేందుకు అడుగులు వేస్తున్నారు. రష్యా టూర్‌తో అగ్ర దేశాల చూపు తిప్పుకున్న మోదీ ఇప్పుడు ఉక్రెయిన్ పర్యటనతో మరోసారి వరల్డ్ వైడ్ సరికొత్త చర్చకు తెరలేపారు. ప్రస్తుతం పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో మోదీ పర్యటిస్తున్నారు. ఇప్పటికే పోలాండ్(Poland)కు ఆయన చేరుకున్నారు కూడా. అయితే ఓ భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటిస్తుండడం గత 45 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
70 ఏళ్లలో ఇదే తొలిసారి
మోదీ పర్యటనలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు, స్వేచ్ఛా వాణిజ్యం గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. భారత్, పోలాండ్ మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని ఈ పర్యటనకు వెళ్లారు. మరోవైపు రష్యాలో పర్యటించిన నెల రోజుల వ్యవధిలోనే మోదీ ఉక్రెయిన్‌కు వెళ్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. 2022లో రష్యా, ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా అక్కడ అడుగు పెడుతున్నారు. ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తర్వాత, ఇటలీ, జర్మనీల్లో జరిగిన జీ-7 సదస్సులో ప్రధాని మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫస్ట్ టైమ్ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలూ ఒకరికొకరు ఆలింగనం చేసుకుని.. యుద్ధ పరిస్థితులపై చర్చించారు.
ఎటూ తెగని వివాదం.. కొలిక్కి వచ్చేనా
అయితే ఇప్పుడు పరిస్థితులు వేరు రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. దాదాపు రెండున్నరేళ్లు గడిచిపోయాయి. రెండు వైపులా ఎంతో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిపోయింది. కానీ పట్టుదలకు పోయి వెనకడుగు వేయడం లేదంతే. మధ్యలో రాజీ కుదిర్చే ప్రయత్నాలు కూడా అగ్రదేశాలు చేయకపోవడంతో ఈ వివాదం ఎటూ తెగడం లేదు. ఓపక్క నాటో దేశాలన్నీ ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్న వేళ మోదీ రష్యాలో పర్యటించడం.. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు జరిపారు. ఇప్పుడు ఉక్రెయిన్ వెళ్లి అధ్యక్షుడు జెలెన్‌స్కీని కలుస్తున్నారు. దీంతో ప్రపంచ దేశాలు భారత ప్రధాని వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మరి మన పెద్దన్న ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కుదుర్చుతారో లేదో మరో రెండు రోజుల్లో తేలనుంది.









