PM: ప్రధాని మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం.. CHG సమావేశానికి రావాలని పిలుపు

 

ManaEnadu:ప్రస్తుతం ఉక్రెయిన్​ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో దేశం నుంచి అనుకోని ఆహ్వానం అందింది. అది ఎవరి నుంచో కాదు.. ఏకంగా భారత్ దాయాది దేశమైన పాకిస్థాన్ నుంచి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇస్లామాబాద్‌ వేదికగా నిర్వహించనున్న కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సిహెచ్‌జి) సమావేశానికి హాజరు కావాలని మోదీని పాకిస్థాన్ ఆహ్వానించింది. ఆయనతోపాటు షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో)కు చెందిన ఇతర నేతలనూ పిలిచింది.

అయితే పాక్‌తో సమస్యాత్మక సంబంధాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఆ దేశానికి వెళ్లేందుకు సిద్ధంగా లేరని తెలిసింది. గతంలో మాదిరిగానే భారత్‌ విదేశాంగ మంత్రి జైశంకర్‌ వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల జమ్మూలో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో మన విదేశాంగ మంత్రి భద్రతపై నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తుండటంతో.. ఆయన కూడా ఈ సమావేశాలకు హాజరు కావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

చివరిసారిగా 2015లో అప్పటి భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ పాకిస్థాన్‌లో పర్యటించారు. ఆ తర్వాత మన దేశం నుంచి ప్రధాని, విదేశాంగ మంత్రులెవరూ అక్కడికి వెళ్లకపోవడం గమనార్హం. గతనెలలో కార్గిల్‌ విజయ్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని అన్నారు. పరోక్ష యుద్ధంతో ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ఆయన పాక్ పర్యటన కచ్చితంగా ఉండదని ప్రభుత్వ వర్గాల సమాచారం.

రష్యా, చైనా నేతృత్వంలో ఉన్న సీహెచ్‌జీ ప్రాంతీయ భద్రత, మధ్య ఆసియా దేశాలతో సహకారం వంటి అంశాలను పర్యవేక్షిస్తుంది. భారత్‌, పాక్‌ ఇందులో సభ్యులుగా ఉన్నాయి. ప్రస్తుతం సీహెచ్‌జీకి అధ్యక్షత వహిస్తున్న పాకిస్థాన్ అక్టోబర్‌ 15-16వ తేదీల్లో దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో నాయకులు స్వయంగా పాల్గొనలేని పరిస్థితుల్లో వర్చువల్‌ విధానం ఉంటుందా లేదా అనే విషయం ఇంకా వెల్లడించలేదు.

Share post:

లేటెస్ట్