ManaEnadu:కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటనపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసులో చాలా ఆధారాలను ట్యాంపర్ చేశారని.. ముఖ్యంగా క్రైమ్ సీన్లో ఆధారాలన్నింటిని తొలగించారని సీబీఐ ఆరోపిస్తోంది. మరోవైపు ఈ కేసులో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ ఘోష్ కీలకంగా మారారు. హత్యాచారానికి గురైన డాక్టర్ ఆత్మహత్య చేసుకుందంటూ కుటుంబానికి సమాచారం ఇవ్వడంతో ఆస్పత్రి యాజమాన్యం తీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆ ఆస్పత్రి ప్రిన్సిపల్‌గా ఉన్న సంజయ్ ఘోష్‌ను సస్పెండ్ చేసి బదిలీపై పంపించారు. ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో జరిగిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై చర్యలు చేపట్టిన సీబీఐ.. ఇప్పటికే అవకతవకలకు పాల్పడినట్లు ఘోష్‌పై కేసులు నమోదు చేసింది. చివరకు శవాలను కూడా వదలకుండా వాటిని కూడా అమ్మేసినట్లు విచారణలో తేలినట్లు అధికారులు తెలిపారు. ఇక తాజాగా సంజయ్ ఘోష ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దాడులు మొదలుపెట్టింది. ఇవాళ (ఆదివారం) ఉదయం నుంచి మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సీబీఐ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి.
ఆగస్టు 9వ తేదీ ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రెయినీ పీజీ డాక్టర్ హత్యాచారానికి గురికావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు తీరు దారుణంగా ఉందనే విమర్శలు రావడంతో హైకోర్టు కేసును సీబీఐకి బదిలీ చేయగా ఆర్జీ కార్ ఆస్పత్రిలో గతంలో పనిచేసిన డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ మాజీ ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఈ కేసును కూడా కోర్టు సీబీఐకి బదిలీ చేస్తూ.. మూడు వారాల్లోగా దర్యాప్తు స్టేటస్ రిపోర్టును సమర్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సందీప్ ఘోష్ మరో నలుగురికి శనివారం లైడిటెక్టర్ పరీక్షలు చేశారు.







