Mana Enadu: ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలపై స్టే ఇచ్చిన హైకోర్టు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతను ఆపాలంటూ నాగార్జున తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనంస్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇది నాగార్జునకు ఊరటనిచ్చింది. ఆక్రమణలకు పాల్పడుతున్న వారెవరైనా వదలమని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో రేవంత్ రెడ్డి సర్కార్ సంకేతాలు ఇచ్చింది. మరోవైపు చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమించి నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటించారు. బాధ్యతలు స్వీకరించిన సమయంలో మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చట్టం అందరికీ ఒక్కటేనని ఆయన చెప్పారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేస్తే కూల్చివేస్తామని ఆయన చెప్పారు.
కాగా.. టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నిర్మించారనే ఫిర్యాదుల ఆధారంగా దీన్ని కూల్చారు. భారీ బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు గంటల వ్యవధిలో ఈ కన్వెనన్‌ను నేలమట్టం చేశారు. మాదాపూర్‌లో పది ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారు. అయితే వాగులు, కాలువలు, చెరువులు పది మీటర్ల వెడల్పుతో ప్రవహిస్తుంటే దానికి తొమ్మిది మీటర్ల దూరం తర్వాతే భవనాల నిర్మాణానికి అనుమతివ్వాలి. ఆపై వెడల్పుతో ప్రవహించే నీటి వనరులకు 30 మీటర్ల దూరం తర్వాతే భవన నిర్మాణాలకు అనుమతివ్వాలని పంచాయితీ, మున్సిపల్ చట్టాలు చెబుతున్నాయి.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో..
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొలుత గురుకుల్ ట్రస్టు భూముల్లో నిర్మాణాలను కూల్చింది. అదే సమయంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేస్తారని అప్పట్లో ప్రచారం సాగింది. కానీ, నాగార్జున కోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు రీసర్వే కూడా చేశారు. అయితే ఈ రీసర్వే రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందింది. అయితే ఈ విషయమై అప్పట్లో అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి ఈ విషయమై ఆగస్టు 21న మరోసారి హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
రేవంత్ రెడ్డి కూతురు ఎంగేజ్‌మెంట్ ఇక్కడే..
ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డి ఎంగేజ్ మెంట్ కూడా ఇదే ఎన్ కన్వెన్షన్ సెంటర్లో 2015 జూన్ 11న జరిగింది. అప్పుడు ఓటుకు నోటు కేసులో జైలులో ఉన్న రేవంత్ కోర్టు అనుమతితో ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ కేబినెట్ మంత్రులు, సహచరులు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సహా పలువురు ఈ వేడుకకు హాజరయ్యారు. దీంతోపాటు ఇటీవల సినీనటులు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ కూడా ఇక్కడే జరిగడం విశేషం.