ManaEnadu:టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్.. ఈ ఏడాది వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. హిట్, ప్లాఫ్లతో సంబంధం లేకుండా ఈ హీరోకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే నా సామిరంగలో నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ఇటీవలే పురుషోత్తముడు, తిరగబడర సామీ అనే సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు నెల గ్యాప్‌లో మరో సినిమాతో ముందుకు రాబోతున్నాడు.
మూడు నెలలు.. మూడు సినిమాలు
మూడు నెలల్లో మూడు సినిమాలతో అలరించాడు ఈ యంగ్ హీరో. జులైలో పురుషోత్తముడు, ఆగస్టులో తిరగబడర సామీ, ఇప్పుడు సెప్టెంబర్‌లో భలే ఉన్నాడే అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భలే ఉన్నాడే అంటూ రాజ్ తరుణ్ సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. వర్దన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మనీషా కంద్కూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భలేభలే మగాడివోయ్, రాజాసాబ్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది.
సెప్టెంబర్ 7న రిలీజ్..
ఇక ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమాలో ‘సోఫియా..’ అంటూ సాగే పాటను హీరో విశ్వక్‌సేన్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. దేవ్ రాసిన ఈ పాటను శేఖర్ చంద్ర స్వరపరచగా, కరీముల్లా ఆలపించారు. మరోవైపు ఈ మూవీలో ఆడపిల్లలకు ఆమడదూరం.. చేసేది చీరల బేరం.. తెల్లారితే సూదీ దారం.. యవ్వారం.. యమునాతీరం.. అంటూ సాగే పాటకు ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తోంది. అమ్మాయిలంటే ఆమడ దూరంలో వుండే కుర్రాడిగా ఇందులో రాజ్‌తరుణ్ కనిపించనున్నాడు. వీటీవీ గణేశ్, హైపర్ ఆది, కృష్ణభగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్, సింగీతం శ్రీనివాస్, అభిరామి, గోపరాజు రమణ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలో విడుదల కానుంది.






