ManaEnadu:తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మనుసింఘ్వీ (Abhishek Manu Singhvi ) ఎన్నిక ఏకగ్రీవం అయింది. రాజ్యసభ అభ్యర్థిత్వానికి రెండు నామినేషన్లు దాఖలు కాగా.. కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, స్వతంత్ర అభ్యర్థిగా పద్మరాజన్ నామినేషన్ దాఖలయ్యాయి. అయితే పద్మరాజన్ ను ఎమ్మెల్యేలు బలపరచలేదు. దీనివల్ల ఆయన నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఈ క్రమంలో అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవంగా రాజ్యసభ (Telangana Rajya Sabha MP)కు ఎన్నిక అయ్యారు. ఆయన తరఫున కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఎన్నికల అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోనున్నారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నేత కేశవరావు (Former MP K Keshava Rao) రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో ఆ స్థానంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇచ్చింది. కేశవరావు స్థానంలో కాంగ్రెస్ హైకమాండ్ అభిషేక్ మను సింఘ్వీని బరిలోకి దింపింది. ఈ నేపథ్యంలోనే అభిషేక్ మను సింఘ్వీ ఆగస్టు 19వ తేదీన శానససభలో నామినేషన్ వేశారు. అయితే అభిషేక్ సింఘ్వీతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేయడం.. ఆయనకు ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో నామినేషన్ వీగిపోయింది. లేకపోతే వచ్చే నెల 3వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉండేది.
సుధీర్ఘకాలంగా అభిషేక్ సింఘ్వీ కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్న విషయం తెలిసిందే. 2001 నుంచి కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా.. 2006, 2018లో రెండు దఫాలు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్ నుంచి పోటీ చేసి బీజేపీ చేతిలో ఓటమి పాలైన ఆయన్ను తాజాగా తెలంగాణ నుంచి రాజ్యసభ బరిలోకి ఏఐసీసీ (AICC) నింపింది. తెలంగాణలో రాజ్యసభ సభ్యత్వం కోసం స్థానిక నాయకులు కొందరు ప్రయత్నించినా.. జాతీయ రాజకీయాల్లో సింఘ్వీ సేవలు కాంగ్రెస్‌కు కీలకం కావడంతో ఆయనకు ఛాన్స్ ఇచ్చింది.