ManaEnadu:హైదరాబాద్ మహానగరంలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములు కబ్జా చేసి నిర్మాణాలు చేసిన వారిపై హైడ్రా (Hydra Demolitions) ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి ఇంటికి హైడ్రా నోటీసులు అంటించింది. దుర్గం చెరువు పరిధిలోని అమర్ సొసైటీలో అక్రమ నిర్మాణం చేశారంటూ, నెలలోగా ఆ ఇంటిని కూల్చేయాలంటూ హైడ్రా నోటీసుల్లో పేర్కొంది.
ఈ నేపథ్యంలో దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్ నోటీసులపై తిరుపతి రెడ్డి (Enumula Tirupati Reddy) తాజాగా స్పందించారు. అమర్ సొసైటీలో తాను ఇంటిని నిర్మించలేదని, కట్టిన ఇంటినే కొనుగోలు చేశానని తెలిపారు. తనకు ఇల్లు అమ్మిన యజమాని అన్ని అనుమతులతోనే ఇంటిని నిర్మించారని పేర్కొన్నారు. ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు బఫర్ జోన్ (FTL Buffer Zone)లో ఉందని చెప్పలేదని.. తన ఇల్లు బఫర్ జోన్‌లో ఉందని ఇప్పుడు నోటీసులు వచ్చాయని తెలిపారు.
నన్ను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది..
నిబంధనల ప్రకారం లేకుంటే కూల్చేయవచ్చన్న ఆయన.. సమయం ఇస్తే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు తనను లక్ష్యంగా చేసుకొని అమర్ సొసైటీ వాళ్లను ఇబ్బంది పెడుతున్నారని.. తనను లక్ష్యంగా చేసుకోకపోతే మిగతా వాళ్లు ఇబ్బంది పడేవాళ్లు కాదని ఆయన వ్యాక్యానించారు.
హైడ్రా హడల్
ఇక తిరుపతిరెడ్డి ఇంటికి ‘హైడ్రా’ అధికారులు ఇవాళ (ఆగస్టు 29వ తేదీ) నోటీసులు అంటించిన విషయం తెలిసిందే. మాదాపూర్‌లోని అమర్ కో-ఆపరేటివ్ సొసైటీ (Amar Co-Operative Society)లో ఆయన నివాసముంటుండగా.. ఆ ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు గుర్తించి నోటీసులు అంటించారు. మరో వైపు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు ఇలా మొత్తం 200కు పైగా భవనాల యజమానులకు నోటీసులు జారీ చేశారు. నెలలోపు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని నోటీసుల్లో హైడ్రా అధికారులు పేర్కొన్నారు.