ManaEnadu:తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains) వణికిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల్లోని చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక నగరాల్లోనూ పరిస్థితి కాస్త గంభీరంగానే ఉంది. శనివారం ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు (Rains in Telugu States) అతలాకుతలం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే విపత్తు బృందాలు రంగంలోకి దిగి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఓ సందేశం ఇచ్చారు. ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు పెట్టారు.
“తెలుగు రాష్ట్రాల్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. వరదల (Floods in Telugu States) ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. చాలా గ్రామాలు, జాతీయ రహదారులు వరద నీటిలో మునిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ ఇంట్లో ఒకడిగా.. మీ కుటుంబ సభ్యుడిగా మీ అందరికి నా రిక్వెస్ట్ ఒక్కటే. దయచేసి అత్యవసరం అయితే తప్ప ఎవరూ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకండి. వైరల్ ఫీవర్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి.
ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మెగా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటారు. ఇప్పుడు కూడా అదే విధంగా అభిమానులంతా అండగా నిలుస్తారు. అవసరమైన వారికి చేయూత అందిస్తారు. అని నేను ఆశిస్తున్నా’’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో కళింగపట్నం సమీపంలో తీరం దాటడంతో ఇవాల తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు (Rains) పడుతున్నాయి. ఇరు రాష్ట్రాల్లోని చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మేఘం బద్ధలైందా అన్నట్లు ఏకధాటిగా వాన కురుస్తూనే ఉంది.