ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో(Delhi Election Result) ఆప్(AAP)నకు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో ఘోర పరాజయం చవి చూశారు. మరోవైపు ఆప్ అగ్రనేతలు మనీశ్ సిసోదియా, సత్యేందర్ జైన్ కూడా ఓడిపోయారు. ఫలితాల సరళిలో ఓటమి వైపు సాగుతోన్న పార్టీకి పెద్ద నేతల పరాజయం మరింత దెబ్బకొట్టింది.
ఓటమి చవిచూసిన ఆప్ అగ్రనేతలు
న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఘన విజయం సాధించారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో వికసించిన కమలం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పర్వేశ్ వర్మ (Parvesh Varma)ను ప్రకటించనున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు జంగ్పురలో బీజేపీ అభ్యర్థి తర్వీందర్సింగ్ చేతిలో సిసోదియా (Manish Sisodia) ఓడిపోయారు. షాకుర్ బస్తీలో సత్యేందర్ జైన్ ఓటమి చవిచూశారు.
దిల్లీ సీఎం అతీశి విజయం
మరోవైపు చివరి రౌండ్ వరకు ఓటమి అంచుల్లో ఉన్న సీఎం అతీశి (Atishi) అనూహ్యంగా విజయం సాధించారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ పడిన ఆమె బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యర్థి రమేశ్ బిధూరీ సీఎం అతీశిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అతీశీకి మేలు చేసినట్లుగా ఈ ఫలితాలు చూస్తే కనిపిస్తోంది.






