ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా (BJP Wins Delhi Elections 2025) ఎగిరింది. దేశరాజధానిలో27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కమలం వికసించింది. ఆప్ హ్యాట్రిక్ ఆశలకు గండికొట్టి కేజ్రీ’వాల్’ను కూల్చి కాషాయ పార్టీ విజయ ఢంకా మోగించింది. దక్షిణాదితో పాటు ఉత్తరాదిన ఢిల్లీ అసెంబ్లీ పీఠం బీజేపీకి చాలా ఏళ్ల నుంచి కొరకరాని కొయ్యగా మారిన విషయం తెలిసిందే.
ఒక్కఛాన్స్ ఇచ్చేశారుగా
ఈసారి హస్తిన పీఠాన్ని (Delhi Assembly Election Results 2025) దక్కించుకోవాలని పంతం పట్టిన బీజేపీ ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఆప్ నేతల స్కాములు కూడా కమలం పార్టీకి అనుకూలంగా మారాయి. కేజ్రీవాల్ పాలనా వైఫల్యాలు ఎండగడతూ.. స్థానిక సమస్యల పరిష్కరిస్తామంటూ.. ‘ఉచిత’ వ్యూహాల వర్షం కురిపిస్తూ ఢిల్లీ ప్రజలను తమవైపు తిప్పుకున్నారు కమలనాథులు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయాన్ని చెప్పకుండానే ఎన్నికల బరిలో దిగి విజయఢంకా మోగించింది.
టార్గెట్ కేజ్రీవాల్..!
ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ (Kejriwal) లక్ష్యంగానే బీజేపీ తన వ్యూహాలు రచించింది. ఎన్నికల ప్రచారం కూడా ఆయన చుట్టే కొనసాగేలా జాగ్రత్త పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక అంశాల పైనే ప్రధానంగా దృష్టి సారించి.. రోడ్ల నిర్వహణ, నీటి కొరత, కాలుష్యం, మౌలిక సదుపాయాల కల్పనలో ఆప్ ప్రభుత్వం విఫలమైందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది.
మహిళల ఓటు బీజేపీకే
ఢిల్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు వరాల కురిపించినా.. వారు మాత్రం తమ మద్దతు బీజేపీకే అని ఈ ఎన్నికల్లో స్పష్టం చేశారు. ‘మహిళా సమృద్ధి యోజన (Mahila Mariddhi Yojana)’ కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయాన్ని అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఒక్క ఛాన్స్ అంటూ రిక్వెస్ట్ చేసిన బీజేపీ వైపే మహిళలు మొగ్గుచూపారు.






