బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ఇంట్లో చొరబడి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. తానే సైఫ్ అలీఖాన్‌ను కత్తితో పొడిచానని నిందితుడు విజయ్ దాస్ అంగీకరించాడు. అసలైన నిందితుడు విజయ్‌దాస్‌ను థానేలో అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు ముంబయి పోలీసులు తెలిపారు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌లో అరెస్టు చేసిన అనుమానితుడు కైలాశ్ కన్నోజియా నిందితుడు కాదని చెప్పారు.
“ఓ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పని చేస్తున్న నిందితుడు విజయ్ దాస్.. దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడ్డారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ముంబయి డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించి వివరాలు వెల్లడిస్తాం.” అని ముంబయి పోలీసులు (Mumbai Police) తెలిపారు.
విజయ్ దాస్ కంటే ముందు, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని పోలిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఒకరిని ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వే స్టేషన్‌లో RPF పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక అనుమానితుడిని అరెస్టు చేసి బాంద్రా పోలీసు స్టేషన్‌లో విచారించి నిందితుడు కాదని నిర్ధరించి విడుదల చేసినట్లు చెప్పారు. ఈనెల 16న సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడిన దుండగుడు అతడిపై దాడికి తెగబడిన విషయం తెలిసిందే.







