Mana Enadu: ఇష్టమైన చదువు చదివింది. ఎంబీబీఎస్ పూర్తి చేసి.. నచ్చిన విభాగంలో పీజీ చేసి.. మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని నిర్ణయించుకుంది. కానీ.. విధికి ఆమెపై కన్ను కుట్టింది. ఆమె కలలను చూసి ఓర్వలేక.. మరణ రూపంలో ఆమె కన్న కలలన్నింటినీ కల్లలుగా మార్చేసింది. ఫ్రెండ్స్ తో ఆనందంగా, సరదాగా గడపానలని ట్రెక్కింగ్ కు వెళ్లడమే ఆమె పాలిట శాపంగా మారింది.
కృష్ణాజిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల (23) ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్ లోని బాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తి చేసి.. ప్రస్తుతం రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. మార్చి 2న సరదాగా తోటి స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ కు వెళ్లిన ఉజ్వల.. కాలుజారి లోయలో పడి మరణించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కూతురి మరణవార్త విన్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా.. ఉజ్వల తల్లిదండ్రులు వేమూరు మైథిలి – వెంకటేశ్వరరావు ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డారు. ఆమె అంత్యక్రియలను మాత్రం స్వగ్రామంలోనే నిర్వహించనున్నారు. శనివారం ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి ఉజ్వల భౌతిక కాయాన్ని తీసుకురానున్నారు.