AP సంతానం లేని దంపతులు.. అక్కడ నిద్రచేస్తే పిల్లలు పుడతారట.. కార్తీక సోమవారం ప్రత్యేకత

అది చూడడానికి ఓ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం. మూడవ శతాబ్దంలో బౌద్ధ బిక్షవులు అక్కడ జీవించారని చారిత్రక ఆనవాళ్లు చెబుతున్నాయి.. ఇప్పటికే ఆ ప్రాంతం ప్రముఖ బౌద్ధ పర్యటక ప్రాంతంగా పేరొందింది. కానీ అక్కడ ఉన్న ఆ గుహల వద్ద నిద్ర చేస్తే పిల్లలు పుడతారు.. ఇది ఎంతోకాలంగా అక్కడికి వెళుతున్న భక్తుల నమ్మకం.. నిజంగా గుహల వద్ద నిద్రిస్తే పిల్లలు పుడతారా.. భక్తులు నమ్మడానికి గల కారణం ఏమిటి.. కార్తీకమాసంలోనే అక్కడ పానాసారం చేయాలని ఎందుకు చెబుతున్నారు.. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గుంటుపల్లి గుహలు ఎంతో ఫేమస్…. జిల్లా కేంద్రానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో జీలకర్రగూడెంలో కొండపై ఈ గుంటుపల్లి గుహలు ఉన్నాయి. ఈ గుహలను ఆంధ్ర అజంతా గుహలు అని కూడా పిలుస్తారు. అక్కడి గుహలు సువిశాల సుందరమైన కొండల్లో చెక్కబడిన గదులుగా నిర్మితమై ఉంటాయి. అయితే కొండపై అక్కడ ధర్మ లింగేశ్వర స్వామి కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం.. ఓ గుహలో కొండపై కొండటి ఆకారంలో ఉన్న రూపాన్ని ధర్మ లింగేశ్వర స్వామిగా భక్తులు కొలుస్తారు. ధర్మ లింగేశ్వర స్వామి ముందు సంతానం లేని మహిళలు పానాసారం చేస్తే సంతానము కలుగుతుందని అక్కడికి వచ్చే భక్తులు విశ్వసిస్తారు. అందుకనే వాటిని సంతాన గుహలను కూడా పిలుస్తారు.
పానాసారం అంటే ఏమిటి..?
సంతానం లేని మహిళలు గుంటుపల్లి గుహలలో ఉన్న ధర్మ లింగేశ్వర స్వామిని కార్తీక మాసంలోని సోమవారాలలో ప్రత్యేకించి పూజిస్తారు.. పూజలో భాగంగా మహిళలు స్వామిని దర్శించి, గుహ లోపల శివలింగ ఆకారంలో ఉన్న గుండ్రటి గోళం చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి అనంతరం తడి బట్టలతో గుహ బయట నిద్ర చేస్తారు. అలా నిద్ర చేసే సమయంలో ధర్మ లింగేశ్వర స్వామి మహిమ చేత స్వప్నంలో పళ్ళు, పూవులు కనిపిస్తే వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని అక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. దీనినే పానాసారం అంటారు. కార్తీకమాసం సోమవారాల్లో వేల సంఖ్యలో భక్తులు ధర్మ లింగేశ్వర స్వామిని దర్శించుకుని తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. ఓ పక్క బౌద్ధ బిక్షవులు తిరుగాడిన ప్రదేశంగా, ప్రముఖ బౌద్ధ క్షేత్రం గానే కాకుండా ఆధ్యాత్మిక క్షేత్రం గా కూడా గుంటుపల్లి గుహలకు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.

గుంటుపల్లి గుహలలో చూడవలసిన ప్రదేశాలు..

గుంటుపల్లి గుహల ప్రాంతం సువిశాల ఎత్తయిన కొండలో పచ్చని ప్రకృతితో అలారారుతుంది. కొండ యావత్తు గదులుగా చెక్కబడి ఉంటాయి.. అక్కడ గుహలలోని ఇసుకరాతిలో చెక్కబడిన ఐదు గదుల సముదాయం ఉంది. గదులలో ఆ కాలంలో వాడిన ఉపకరణాలు సైతం మనకు అక్కడ కనిపిస్తాయి. అంతేగాక ఆ గదిలలో వర్షాపనీరు బయటకు పోవడానికి ప్రత్యేకంగా కాలువలు కూడా త్రవ్విన దృశ్యాలు మనకు కనిపిస్తాయి. అలాగే కొండపైన పెద్దని రాతితో నిర్మితమైన అనేక గుండ్రటి ఆకారంలో స్థూపాలు, అనేక నిర్మాణాలు ఉంటాయి.. అలాగే బౌద్ధ బిక్షువులు నిర్మించిన మందిరం కూడా శిథిలావస్థలో మనకు అక్కడ దర్శనమిస్తుంది. అదేవిధంగా ఓ పెద్దని పాదం ఆకారంలో ఉన్న లోతైన నిర్మాణం మనకు కనిపిస్తుంది.. భీముని పాదంగా అక్కడికి వచ్చిన పర్యాటకులు పిలుస్తారు. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో వేల సంఖ్యలో పర్యాటకులకు అక్కడికి చేరుకుని అక్కడ నిర్మించిన బౌద్ధ స్తూపాలతో పాటు, అక్కడ కొలువైయున్న ధర్మ లింగేశ్వర స్వామి పూజిస్తారు.

Share post:

Popular