APSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్-ప్రమోషన్లపై భారీ ఊరట..!

ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తర్వాత ప్రమోషన్లపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీలో విలీనం నేపథ్యంలో ఉద్యోగులకు ప్రమోషన్ల విషయంలో ప్రభుత్వ తాజా అర్హతలు, నిబంధనలు వర్తింపచేస్తే వారికి అన్యాయం జరుగుతుందన్న విషయంపై జరుగుతున్న చర్చకు దీంతో తెరపడింది.

పాదయాత్రలో ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీఎస్ ఆర్టీసీని సర్కార్ లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు గతంలో పొందిన పలు ప్రయోజనాలు దూరమయ్యాయి. ఇదే క్రమంలో గతంలో నిర్ణయించిన విద్యార్హతల ప్రకారం ఇప్పుడు ప్రమోషన్లు కూడా లభించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఉద్యోగులు తమకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో ఈ విషయంపై పరిశీలన జరిపిన ప్రభుత్వం.. ఆర్టీసి(పిటిడి) ఉద్యోగులకు పాత విద్యార్హతల ప్రకారం పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించింది.ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులకు ఇకపై ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల్లో ఉన్న విద్యార్హతల ప్రకారం కాకుండా గతంలో ఆర్టీసీ కార్పోరేషన్ లో ఉన్నప్పుడు నిర్ణయించిన విద్యార్హతల ప్రకారమే ప్రమోషన్లు లభించనున్నాయి.
విలీనానికి ముందున్న నిబంధనల మేరకు ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం వల్ల పదవ తరగతి లోపు విద్యార్హతలు ఉన్నవారికి ప్రమోషన్లతో పాటు ఏఏయస్ ఇంక్రిమెంట్లలో ఉద్యోగులకు ప్రయోజనం కలుగబోతోంది. గతంలో ఏపీజేఏసీ ఆధ్వర్యంలో 92 రోజుల పాటు సాగిన ఉద్యమంలో పెట్టిన డిమాండ్ల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో 31-12-2019 లోపు ఆర్టీసీ విలీనం నాటికి ముందున్న 50 వేల మందికి రిటైర్డ్ అయ్యే వరకు పాత నిబంధనల విద్యార్హతల మేరకే పదోన్నతులు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

 

Share post:

లేటెస్ట్