
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case)పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని అనుకున్నానని.. ఆయన కుమార్తె సునీత పోస్టుమార్టం అడగకపోతే ఆయన అంత్యక్రియలు జరిపించేసి ఉండేవాళ్లని అన్నారు. అలా జరిగితే ఆయనది హత్య అని తేలేది కాదని ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో (AP Assembly Sessions 2025) చంద్రబాబు మాట్లాడారు.
నేరస్థులు ఎలా ట్రాప్ లో పెడతారనేందుకు ఉదాహరణ వివేకా హత్య. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని మొదట చెప్పారు. సునీత పోస్టుమార్టం అడగక పోయి ఉంటే అంత్యక్రియలు చేసేవారు. ఏ టీవీ గుండెపోటు అని చెప్పారో… వారే సాయంత్రానికి వార్త మార్చారు. నారాసుర రక్తచరిత్ర అని తప్పుడు ప్రచారం… pic.twitter.com/5yJSMuaRXU
— Telugu Desam Party (@JaiTDP) March 11, 2025
గుండెపోటు.. గొడ్డలి పోటుగా మారింది
ఈ కేసులో సాక్షులుగా ఉన్న వారు అనుమానాస్పదంగా చనిపోయారని సీఎం (CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఈ కేసులో ఆరుగురు చనిపోయారని తెలిపారు. దీనిపై లోతుగా దర్యాప్తు జరగాల్సిందేనని.. గుండెపోటు అని చెప్పిన టీవీలోనే గొడ్డలి పోటని వార్త ఇచ్చారని చంద్రబాబు అన్నారు. ఆ హత్య కేసును వైఎస్సార్సీపీ నేతలు తనకు ముడిపెట్టి దుష్ప్రచారం చేశారని వాపోయారు. హత్యారాజకీయాలు లేకుండా 40 ఏళ్లుగా తాను రాజకీయం చేస్తున్నానని చెప్పుకొచ్చారు.
నేరాలు చేస్తే చూస్తూ ఊరుకోం
“రాజకీయ ముసుగులో నేరాలు చేసి తప్పుకుంటామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. సాంకేతికతను వినియోగించుకుని శాంతి భద్రతల్ని అదుపులో ఉంచుతాం. ఉదాసీనంగా ఉంటే కొందరు పేట్రేగిపోయే అవకాశం ఉంటుంది. కొందరు భావోద్వేగాలతో ట్రాప్లో పడుతున్నారు. ఇంకొందరు ప్రేమ పేరుతో అమాయకులను ముగ్గులోకి దింపుతున్నారు. రాజకీయ ముసుగులో హత్యలు, నేరాలు, చేస్తే చూస్తూ ఊరుకోం” అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.