ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ (AP Budget Sessions 2025) సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కాగానే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ (ap governor abdul nazeer) ప్రసంగిస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారని ఆయన అన్నారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందన్న ఆయన.. గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం ఎంతో నష్టపోయిందని పేర్కొన్నారు.
అవకాశమిస్తే మెరుగైన సేవ చేస్తారు
‘సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ (Land Titling Act)ను రద్దు చేశాం. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్‌సీ దస్త్రంపై సంతకం చేశాం. అన్న క్యాంటీన్లు తెచ్చి పేదవాళ్ల ఆకలి తీరుస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. మా ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగింది. అవకాశాలిస్తే ప్రతి ఒక్కరూ మెరుగైన సేవలు అందిస్తారు.’ అని గవర్నర్ నజీర్ తెలిపారు.
అదే మా ఆకాంక్ష
“అర్హులైన అందరికీ సొంతిల్లు ఉండాలనేది మా ఆకాంక్ష. ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు, విద్యుత్ ఉండాలి. యువతకు మెరుగైన శిక్షణ ఇవ్వాలనేది మా విధానం. పీ-4 విధానం ద్వారా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో పేదరికం నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రజలకు మెరుగైన వైద్యసేవల కోసం సరికొత్త విధానాలు తీసుకువచ్చాం. ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్ ద్వారా పేదలకు మెరుగైన వైద్యసేవలు.” – అబ్దుల్ నజీర్, ఏపీ గవర్నర్
స్వర్ణాంధ్ర కల సాకారం చేస్తాం
2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామని గవర్నర్ ఉద్ఘాటించారు. ప్రతినెల 1వ తేదీనే ఇంటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు అందిస్తున్నామన్న ఆయన.. విద్య, వైద్యం, మౌలికవసతులపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. బీసీ వర్గాలు సమాజానికి వెన్నెముక అని పేర్కొన్న గవర్నర్.. స్థానికసంస్థలు, నామినేటెడ్ పోస్టుల్లో వారికి 34 శాతం రిజర్వేషన్లు (BC Reservations) కల్పించినట్లు చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టామని వివరించారు.






