
ఏపీలో గ్రూప్-2 మెయిన్ పరీక్షల (AP Group 2 Mains) నిర్వహణపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాసేపటి క్రితమే పరీక్ష యధావిధిగా జరుగుతుందంటూ ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఎగ్జామ్ వాయిదా వేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలు నమ్మొద్దని తేల్చి చెప్పింది. అయితే ఏపీపీఎస్సీ ప్రకటన చేసిన కాసేపటికే ఈ పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) కమిషన్ కు లేఖ రాసింది.
పరీక్ష వాయిదా వేయండి
ఏపీపీఎస్సీ గ్రూప్స్ -2 మెయిన్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర సర్కార్.. ఆదివారం (ఫిబ్రవరి 23వ తేదీ) నిర్వహించాల్సిన పరీక్ష కొన్ని రోజులు వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీ (APPSC) సెక్రటరీకి లేఖ రాసింది. రోస్టర్ తప్పులు సరి చేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్ధుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో.. కోర్టులో రోస్టర్ అంశంపై పిటిషన్ దాఖలు చేశారు.
మార్చి 11న మరోసారి విచారణ
ఈ వ్యాజ్యంపై మార్చి 11వ తేదీన న్యాయస్థానం మరోమారు విచారణ చేపట్టనుంది. అయితే కోర్టులో ఉన్న ఈ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందన్న రాష్ట్ర ప్రభుత్వం.. అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరింది. ఈ మేరకు ఏపీపీఎస్సీకి తాజాగా లేఖ రాసింది. గ్రూప్ -2 అభ్యర్థుల ఆందోళనలను గుర్తించిన నేపథ్యంలో కమిషన్ కు ఈ మేరకు విజ్ఞప్తి చేసింది.