
పురుషులకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు హైదరాబాద్ మహానగరంలో “SHE టీమ్స్” తరహాలో “HE టీమ్స్ (HE Teams)” ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ఇందిరా చౌక్ వద్ద శనివారం రోజున ప్రత్యేక ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో బిగ్ బాస్ ఫేం శేఖర్ బాషా, పలువురు అడ్వకేట్లు, సామాజిక కార్యకర్తలు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మగవారి రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హీ టీమ్స్ కావాలి
తెలంగాణలో మహిళల రక్షణ కోసం “SHE టీమ్స్” విజయవంతంగా పని చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల పురుషులపై వేధింపులు, దాడులు ఎక్కువవుతున్న దృష్ట్యా పలువురు తమకు కూడా న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. పురుషులు కూడా అన్యాయానికి గురవుతున్నారని.. వారికి న్యాయం చేసేందుకు ప్రత్యేక టీమ్ అవసరమని ఆందోళనకారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొన్ని సందర్భాల్లో మహిళలు తప్పుడు ఆరోపణలతో పురుషులను కేసుల్లో ఇరికిస్తున్నారని, దీని వల్ల అమాయకులైన పురుషులు శిక్ష అనుభవించాల్సి వస్తోందని వాపోయారు.
మాకు న్యాయం జరగాలి
మగవారి సమస్యలు పరిష్కరించేందుకు “HE టీమ్స్” ఏర్పాటు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఇదే ఈ సమస్యకు ఓ సమర్థమైన పరిష్కారమని అన్నారు. పురుషులు కూడా సమాజంలో బాధితులుగా మారుతున్న సందర్భాలు ఉన్నాయని బిగ్ బాస్ ఫేం శేఖర్ బాషా అన్నారు. SHE టీమ్స్ మహిళలకు ఎంతగా ఉపయోగపడుతున్నాయో, అదే విధంగా HE టీమ్స్ కూడా పురుషులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనవసర కేసుల నుంచి, మోసాల నుంచి పురుషులను కాపాడే వ్యవస్థ అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు.