
ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM)గా రేఖా గుప్తా పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. బీజేపీ హైకమాండ్ రేఖ వైపునకే మొగ్గుచూపినట్లు జాతీయ మీడియా కోడై కూస్తోంది. మంగళవారం రోజున అధికారికంగా రేఖా గుప్తా పేరును బీజేపీ అధిష్ఠానం ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రేఖా గుప్తా షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి గెలిచిన విషయం తెలిసిందే.
అందుకే ఆమే సీఎం
రేఖ గుప్తా.. గతంలో జాతీయ కార్యదర్శిగా పని చేశారు. బీజేవైఎం (BJYM) ఢిల్లీ యూనిట్ కార్యదర్శిగా పని చేస్తూనే.. ఆమె కౌన్సిలర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా పని చేసిన రేఖా గుప్తాకు.. పార్టీ పెద్దలతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఆమె పనితీరుతో సంతృప్తిగా ఉన్న నేతలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినట్లు సమాచారం.
ఢిల్లీ పీఠంపై మహిళా సీఎం
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు లేకపోవడంతో దేశ రాజధాని సీఎం పీఠంపై మహిళను కూర్చోబెట్టాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే పార్టీ కోసం కష్టపడిన రేఖా గుప్తా(Rekha Gupta)ను పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్లేకే ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఫార్ములాను ఢిల్లీలో కూడా అమలు చేయాలని భావిస్తోందట.
20న ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం
ఈ నెల 20వ తేదీన రాంలీలా మైదానంలో అత్యంత గ్రాండ్‌గా ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం (Delhi CM Swearing In Ceremony) ఏర్పాట్లు చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ ప్రమాణస్వీకారానికి 50 మంది సినీ తారలను, పారిశ్రామిక వేత్తలను, దౌత్యవేత్తలకు ఆహ్వానాలు పంపనున్నట్లు సమాచారం. బీజేపీ అగ్ర నేతలతో పాటు కేంద్రమంత్రులు, మిత్రపక్షాలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. దేశంలోని ఆధ్యాత్మిక వేత్తలు బాబా రామ్‌దేవ్, స్వామి చిదానంద, బాబా బాగేశ్వర్ ధీరేంద్ర శాస్త్రి, ఇతర మత ప్రముఖులను కూడా ఈ కార్యక్రమానికి పిలవనున్నారు.