Mana Enadu : మాజీ బాయ్ ఫ్రెండ్, అతడి స్నేహితురాలిని హత్య చేసిన కేసులో బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ (Nargis Fakhri) సోదరి ఆలియా అమెరికాలో అరెస్టయింది. జంట హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఆమె ఉంది. ఈ నేపథ్యంలో ఆమెను న్యూయార్క్ పోలీసులు తాజాగా అరెస్టు (Nargis Fakhri’s sister Arrested) చేశారు. గత నెల మాజీ బాయ్‌ఫ్రెండ్, అతడి స్నేహితురాలిని ఆలియా సజీవదహనం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్
న్యూయార్క్‌లో ఉంటున్న ఆలియా ఫక్రీ కొంతకాలం పాటు ఎడ్వర్డ్ జాకోబ్ అనే యువకుడితో డేటింగ్లో ఉండేది. కొంతకాలం తర్వాత వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఏడాది క్రితం ఈ జంట విడిపోయింది. ఆలియా(Alia Fakhri)తో విడిపోయిన తర్వాత జాకోబ్కు అనాస్టాసియా ఎటినీ అనే యువతి పరిచయమైంది. కొంతకాలంగా ఈ ఇద్దరు సన్నిహితంగా మెలుగుతున్నారు.
ఇంటికి నిప్పంటించిన ఆలియా
అయితే ఈ విషయం కాస్తా ఆలియాకు తెలిసింది. వీరు సన్నిహితంగా ఉంటున్నట్లు తెలిసిన తర్వాత పలుమార్లు తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌పై బెదిరింపులకు పాల్పడింది. ఈ క్రమంలోనే నవంబరు 2వ తేదీన జాకోబ్, ఆయన స్నేహితురాలు ఉంటున్న భవనం వద్దకు వెళ్లింది ఆలియా. ఆ ఇద్దరూ సన్నిహితంగా ఉంది చూసి తట్టుకోలేక వారున్న ఇంటికి నిప్పంటించింది. గమనించిన స్థానికులు వారిని అప్రమత్తం చేసినా.. అప్పటికే మంటల్లో చిక్కుకుని వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
ఆలియాకు జీవితఖైదు పడే అవకాశం
ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆలియా ఫక్రీ(Alia Fakhri Arrest)ని అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమె దోషిగా తేలితే జీవిత ఖైదు పడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు ఆమెను రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణను డిసెంబరు 9వ తేదీకి వాయిదా వేశారు.
నర్గీస్ నుంచి నో రియాక్షన్
మరోవైపు తన సోదరి ఆలియా ఫక్రీ అరెస్టుపై నర్గీస్ ఫక్రీ (Nargis Fakhri) ఇంకా స్పందించలేదు. రణ్‌బీర్ కపూర్ నటించిన రాక్‌స్టార్(Rockstar)తో నర్గీస్ ఫేమ్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కిక్, హౌస్‌ఫుల్ 3 వంటి చిత్రాలతో ఆమె ప్రేక్షకులను మెప్పించారు. త్వరలో హౌస్‌ఫుల్ 5 సినిమాతో అలరించేందుకు నర్గీస్ రెడీ అవుతోంది.






