సొంత‌చెల్లిని న‌డిరోడ్డుపై న‌రికేశారు!

వేరే కులానికి చెందిన వ్య‌క్తిని ప్రేమించింద‌న్న కార‌ణంతో తోడ‌బుట్టిన చెల్లిని సొంత అన్న‌లే న‌రికి చంపారు. మేకల కొట్టంలో దాక్కున్న యువ‌తిని వెతికి చేతి గొడ్డ‌ళ్ల‌తో వెంటాడి వేటాడి అతి కిరాత‌కంగా చంపిన ఘ‌ట‌న మ‌హారాష్ట్రలోని ఛ‌త్ర‌ప‌తి శంభాజీన‌గ‌ర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… సోయ‌గావ్ ఠాణా ప‌రిధిలోని ఓ గ్రామంలో మాయ‌త్ చంద్ర‌క‌ళ అనే యువ‌తి వేరే కులానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. దీన్ని ఆమె కుటుంబ‌స‌భ్యులు తీవ్రంగా వ్య‌తిరేకించారు. దీంతో ఆమె తాను ప్రేమించిన వ్య‌క్తితో అత‌ని ఇంట్లోనే స‌హ‌జీవ‌నం చేస్తోంది. అది ఊరంతా పాక‌డంతో త‌మ ప‌రువు పోయింద‌ని భావించిన ఆమె ఇద్ద‌రు సోద‌రులు ఆమెను చంపేందుకు గొడ్డ‌ళ్ల‌తో బ‌య‌లుదేరారు. ఈ విష‌యం తెలుసుకుని మేక‌ల కొట్టంలో దాక్కున్న ఆమెను వెతికి బ‌య‌టికి ఈడ్చి గొడ్డ‌ళ్ల‌తో నరికేశారు. తీవ్ర‌గాయాల పాలైన ఆమె రోడ్డుపై ర‌క్త‌పుమ‌డుగులో విల‌విల్లాడుతూ మృతిచెందింది. ఈ స‌మ‌యంలో బాధితురాలికి సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చిన ఓ వ్య‌క్తిపై సైతం ఇద్ద‌రు కిరాత‌కంగా దాడికి పాల్ప‌డ్డారు. తీవ్రంగా గాయ‌ప‌డిన ఆ వ్యక్తికి ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి ఇద్ద‌రు సోద‌రుల‌పై కేసు న‌మోదు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.

Share post:

లేటెస్ట్