బిల్డర్లను భయపెట్టేందుకే హైడ్రా: కేటీఆర్‌

Mana Enadu : ప్రభుత్వ భూములు పరిరక్షించేందుకు చెరువులు, నాలాలు, కుంటల కబ్జాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా(Hydra)పై మొదటి నుంచి విపక్షాలు విమర్శలు కురిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హైడ్రాపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. హైడ్రాతో ప్రభుత్వం బిల్డర్లు, వ్యాపారులను భయపెడుతోందని ఆరోపించారు. పేదలకు అండగా ఉంటామని.. రక్షణ కవచంలా నిలుస్తామని భరోసా కల్పించారు.

పేదలకు అండగా ఉంటాం

“హైదరాబాద్ కూకట్‌పల్లిలో 1980లో కాంగ్రెస్‌ ప్రభుత్వమే 20 వేల మందికి పట్టాలు ఇచ్చింది. అవే ఇళ్లను ఇప్పుడు ఆక్రమణలని అంటున్నారు.  పేదలకు అండగా ఉంటాం. రక్షణ కవచంలా నిలుస్తాం. రేవంత్‌రెడ్డి పంపే బుల్డోజర్లకు మేము అడ్డంగా నిలబడతాం. హైదరాబాద్‌లో STPలు (మురుగు నీటి శుద్ధి కేంద్రాలు), SNDP పనులను పరిశీలిస్తాం.” అని కేటీఆర్ పేర్కొన్నారు. 

బస్తీల్లోకి వెళ్లి భరోసా కల్పిస్తాం

బస్తీల్లోకి వెళ్లి భరోసా కల్పిస్తామని.. లీగల్‌ సెల్‌ ద్వారా అండగా ఉంటామని కేటీఆర్ అన్నారు. హైడ్రా వసూళ్లతోనే నాంపల్లిలో కాంగ్రెస్‌ (Congress), మజ్లిస్‌ (MIM) నేతల గొడవ జరిగిందని ఆరోపించారు. రాడార్‌ స్టేషన్‌ (Radar Station)తో స్థానికులకు ఒక్క ఉద్యోగం కూడా రాదని పేర్కొన్నారు. పర్యావరణానికి నష్టం కలిగించే ప్రాజెక్టుకు అనుమతి ఎలా ఇస్తారు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మూసీ విషయంలో ప్రభుత్వానిది రోజుకో మాట

మూసీ సుందరీకరణ(Musi Beautification)కు రూ.లక్షా 50 వేల కోట్లు ఎలా తెస్తారని కేటీఆర్ నిలదీశారు. ప్రభుత్వ అనాలోచిత విధానాలతోనే పేదలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. సరైన ప్రణాళిక లేకుండా ఇష్టం వచ్చినట్లు ముందుకెళ్తున్నారని.. మూసీ విషయంలో రోజుకోమాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దీని పరిధిలోని పేదల ఇళ్లు (Hydra Demolitions) కూలుస్తామని అంటున్నారని.. బిల్డర్లు, వ్యాపారవేత్తలను భయపెట్టేందుకు హైడ్రాను తీసుకొచ్చారని ఆరోపించారు. మూసీ పేరుతో జరుగుతున్న దోపిడీని ప్రజల్లోకి తీసుకెళ్తామన్న కేటీఆర్.. మురుగునీటి శుద్ధి కేంద్రాలను వంద శాతం తామే పూర్తి చేశామని తెలిపారు.

Share post:

లేటెస్ట్