Mana Enadu : ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube) యూజర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా స్లీప్ టైమర్, రీసైజబుల్ మినీ ప్లేయర్(Resizable Mini Player), ఫేవరెట్ ప్లే లిస్ట్.. అనే కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని కంపెనీ తన బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.
స్లీప్ టైమర్
యూట్యూబ్‌లో కథలు వింటూనో.. మ్యూజిక్ వింటూనో.. వీడియోలు చూస్తూనో చాలా మంది నిద్రపోతుంటారు. ఇక వాళ్లు నిద్రలోకి జారుకున్న తర్వాత ఆ వీడియోలు ప్లే అవుతూనే ఉంటాయి. ఫలితంగా ఫోన్ బ్యాటరీ అయిపోతుంది. ఈ సమస్యకు చెక్ పెడుతూనే యూట్యూబ్ స్లీప్ టైమర్ (YouTube Sleep Timer) అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది.
ఈ టైమర్‌ని సెట్ చేసుకొని యూట్యూబ్‌లో వీడియోలు ప్లే చేయొచ్చన్నమాట. మనం ఎంచుకొన్న సమయం ముగియగానే వీడియో ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. వీడియో ప్లే చేశాక స్క్రీన్‌పై కనిపించే సెట్టింగ్స్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే ‘Sleep Timer’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీకు కావాల్సిన సమయాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
ప్లే లిస్ట్‌కు థంబ్‌నైల్స్
ప్లే లిస్ట్‌ను క్రియేట్ చేసుకొనే ఆప్షన్ ఇప్పటికే యూట్యూబ్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ లిస్టును ఇప్పుడు మీకు నచ్చిన వారికి పంపేందుకు కొత్తగా క్యూ ఆర్ కోడ్ ఫీచర్ (QR Code) ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతే కాదండోయ్.. ఆ ప్లే లిస్టుకు మీకు నచ్చిన థంబ్‌నైల్స్‌ను ఏఐ సాయంతో డిజైన్ చేసుకోవచ్చు.
మినీ ప్లేయర్
మల్టీ టాస్కింగ్‌లో భాగంగా మినీ ప్లేయర్(YouTube Mini Player)లో కొత్త సదుపాయాలను యూట్యూబ్ యాడ్ చేసింది. యూట్యూబ్‌లో మినీ ప్లేయర్ కుడివైపు కింది భాగంలో కనిపిస్తుందన్న విషయం తెలిసిందే. ఇకపై మీ మినీ ప్లేయర్‌ని మీకు నచ్చిన చోటుకు మార్చుకోవచ్చు. సైజ్ కూడా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు.