జమ్మూకశ్మీర్‌ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం.. ‘అది ముళ్ల కిరీటమే’

Mana Enadu : జమ్మూ కశ్మీర్‌ (Jammu and Kashmir) నూతన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌ సిన్హా ఇవాళ (అక్టోబర్ 16వ తేదీ 2024) ఆయనతో ప్రమాణం చేయించారు. శ్రీనగర్‌లోని షేర్‌-ఇ-కశ్మీర్‌ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌ సెంటర్‌(SKICC)లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. 

సీఎంతో పాటు ఐదుగురు మంత్రులు ప్రమాణం

ఒమర్​ అబ్దుల్లా(Omar Abdullah)తో పాటు మరో ఐదుగురు మంత్రులు కూడా ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా సురీంద్ర కుమార్ చౌదరీ బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఆరుగురు నేతలు ఎవరూ ప్రమాణస్వీకారం చేయడం లేదని జమ్ముకశ్మీర్ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ చీఫ్‌ తారిఖ్ హమీద్‌ కర్రా తెలిపారు. 

ఇదే తొలి ప్రభుత్వం

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంకా గాంధీలు హాజరయ్యారు. వీరితో పాటు ఇండియా కూటమికి చెందిన ఇతర నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్‌(Jammu Kashmir)కు ప్రత్యేక హోదా రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత ఏర్పాటైన తొలి ప్రభుత్వమన్న విషయం తెలిసిందే. ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ వెలుపలి నుంచి మద్దతు ప్రకటించింది. 

ఆ బాధ్యత ముళ్ల కిరీటం

ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం సీఎం ఒమర్ అబ్దుల్లా(CM Omar Abdullah) తండ్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా (Farooq Abdullah) మీడియాతో మాట్లాడారు.  సీఎం బాధ్యత ముళ్ల కిరీటం లాంటిదని అన్నారు. ప్రజల ఆశలను నెరవేర్చడంలో దేవుడు తన తనయుడికి అండగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని.. ఈ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతుందని తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు. మరోవైపు  కొత్త ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత రాష్ట్ర హోదా పునరుద్ధరణ అని ఒమర్‌ అబ్దుల్లా కుమారుడు జహీర్‌ అబ్దుల్లా అన్నారు.

Share post:

లేటెస్ట్