జూబ్లీహిల్స్ నియోజకవర్గ BRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(62) కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. గత నాలుగు రోజులుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం 5.45 గంటలకు కన్నుమూశారు. ఇటీవల ఆయనకు తీవ్రమైన గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు గత నాలుగు రోజులుగా వెంటిలెటర్‌పై చికిత్స అందించారు. గతంలో ఆయన మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడి చికిత్స తీసుకున్నారు. కాగా మాగంటిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) సహా పలువురు బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. ఇదిలా ఉండగా.. మాగంటి, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు.
రాజకీయాల్లో చురుకైన నేతగా గుర్తింపు
మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) రాజకీయాల్లో చురుకైన నేతగా గుర్తింపు పొందారు. ఆయన వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో TDP టికెట్‌పై గెలుపొందిన ఆయన, ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో BRSలో చేరారు. అనంతరం 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం(Jubilee Hills Constituency) నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తమ అభిమాన, కీలక నేత కోల్పోవడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.






