Mana Enadu : ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో ఏకంగా భారత (India) హైకమిషనర్ సంజయ్‌కుమార్ వర్మను చేర్చి కెనడా మరోసారి భారత్ తో కయ్యానికి కాలు దువ్వింది. ఈసారి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi gang) పేరును తెర పైకి తెచ్చి భారత్‌పై బురద జల్లే ప్రయత్నం చేశారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau). ఆ గ్యాంగ్‌తో కలిసి భారత ఏజెంట్లు.. ప్రో ఖలీస్థానీలను లక్ష్యంగా చేసుకొని కెనడా భూభాగంపై పని చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది.
భారత్ పై కెనడా ఆరోపణలు
నిజ్జర్ హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు పురోగతి వివరాలను రాయల్ కెనడియన్ మౌంటెడ్ (RCMP) అసిస్టెంట్ కమిషనర్ బ్రిగిట్టె గౌవిన్ సోమవారం రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) మీడియాకు వివరిస్తూ.. తీవ్ర ఆరోపణలు చేశారు. కెనడా(Canada India Row)లోని దక్షిణాసియా కమ్యూనిటీని ముఖ్యంగా ప్రో-ఖలిస్థానీలను భారత ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. వీరు కొన్ని గ్రూప్‌ల సాయంతో తమ భూభాగంపై వ్యవస్థీకృత నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారని .. ప్రత్యేకించి బిష్ణోయ్ గ్రూప్ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నట్లు.. ఈ గ్యాంగ్‌కు భారత ప్రభుత్వ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయని గౌవిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మరోసారి వార్తల్లో బిష్ణోయ్ గ్యాంగ్
మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత సిద్ధిఖీ (NCP Leader Murder) హత్యతో ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మరోసారి తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల వేళ బిష్ణోయ్ గ్యాంగ్ పేరును కెనడా అధికారులు ప్రస్తావించడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ప్రస్తుతం ఈ గ్యాంగ్‌స్టర్ జైల్లో ఉండగా.. అతడి సోదరుడు, ఇతర అనుచరులు కెనడా కేంద్రంగా నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.
భారత్ పై నోరుపారేసుకున్న కెనడా
మరోవైపు నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్‌కుమార్ వర్మ (Indian High Commissioner)ను చేర్చడంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మళ్లీ దెబ్బతిన్నాయి. నిజ్జర్ హత్య కేసు దర్యాప్తునకు భారత్ సహకరించడం లేదని కెనడా పీఎం ట్రూడో ఆరోపించడంతో న్యూదిల్లీ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. ఎలాంటి సాక్ష్యాలు ఇవ్వకుండా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడుతోంది.