గతేడాది డిసెంబరు 4వ తేదీన ‘పుష్ప-2 (Pushpa 2)’ విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టయి ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
దావోస్ లో సీఎం రేవంత్
ఇక ఈ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీ వేదికగానే తన అభిప్రాయాన్ని ప్రకటించారు. మరోవైపు తాజాగా దావోస్ పర్యటన (Davos Tour)లో ఉన్న ఆయన్ను ఆంగ్ల మీడియా ప్రతినిధి అల్లు అర్జున్ అరెస్టు గురించి ప్రశ్నించారు. ఈ క్రమంలో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదు కదా అని మీడియా ప్రతినిధి ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. దానికి ఆయన ఏం సమాధానం ఇచ్చారంటే..?
రేవంత్ రెడ్డి స్పందన ఇలా
‘‘బెనిఫిట్ షోకు హీరో వస్తారని పర్మిషన్ ఇవ్వమని రెండ్రోజుల ముందు పోలీసుల వద్ద అనుమతి కోసం వస్తే అక్కడి పరిస్థితుల దృష్ట్యా పోలీసులు నిరాకరించారు. అయినా థియేటర్ (Sandhya Theatre Stampede) వద్దకు అల్లు అర్జున్ వెళ్లారు. ఆయన కోసం భారీగా తరలివచ్చిన అభిమానులను ఆయన సెక్యూరిటీ సిబ్బంది తోసేశారు. ఆ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించింది. అయితే ఆమె మరణం ఆయన చేతుల్లో లేకపోవచ్చు. కానీ ఒక మహిళ చనిపోతే, 10-12 రోజులు బాధిత కుటుంబాన్ని పట్టించుకోలేదు. అందుకే చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై స్పందించారు.







