Mana Enadu : రైతు భరోసా(Rythu Bharosa)పై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని.. రైతు సమాజాన్ని ఆదుకునేందుకు తమ సర్కార్ కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. రైతులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు. రైతులకు పెట్టుబడి సహాయం ఇచ్చేందుకు రైతుబంధు తెచ్చారని.. గత ప్రభుత్వం రైతుబంధు అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly Sessions 2024) భాగంగా ఏడోరోజు రైతు భరోసా విధివిధానాలపై జరిగిన చర్చలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడారు.
రాళ్లకు, గుట్టలకూ ఇద్దామా?
గత సర్కార్ హయాంలో సాగులేని భూములకు ఈ పథకం ద్వారా రూ.22,600 కోట్లు ఆయాచిత లబ్ధి చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. రియల్ ఎస్టేట్, పారిశ్రామికవేత్తలకూ రైతుబంధు ఇచ్చారని.. రాళ్లకు, గుట్టలకూ రైతుబంధు (Rythu Bandhu) ఇద్దామా? అని ప్రశ్నించారు. భూముల్లో రహదారి వెళ్తే.. దానికీ రైతుబంధు జమ చేశారని మండిపడ్డారు. గత సర్కార్ క్రషర్ యూనిట్ల భూములకూ రైతుబంధు ఇచ్చిందని దుయ్యబట్టారు. దొంగ పాస్‌పుస్తకాలు తయారు చేసుకొని రైతుబంధు లబ్ధి పొందారని ఆరోపించారు.
అలా చేస్తే ప్రతిపక్షంలో ఉండేవాళ్లం
“కీలక అంశమైన రైతుబంధుపై చర్చ జరిగితే ప్రతిపక్ష నేత సలహాలు ఇస్తారనుకున్నా. నిజమైన లబ్ధిదారులు ఎవరికీ అన్యాయం జరగకూడదు. మేం ఇచ్చాం కాబట్టి.. మీరూ రాళ్లు, గుట్టలకూ రైతుబంధు ఇవ్వాలంటున్నారు. బీఆర్‌ఎస్ (BRS Party)ను ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొంటే మేం కూడా ప్రతిపక్షంలో ఉండేవాళ్లం. 2023లో అధికారం.. 2024లో డిపాజిట్లు పోయిన మీరు మాకు ఆదర్శం కాదు. ప్రధాన ప్రతిపక్ష నేతకంటే మంత్రి తుమ్మల సీనియర్. ప్రతిపక్ష నేతల సూచనల్లో సహేతుకత కనిపిస్తే స్వీకరిస్తాం.. బేషజాలు లేవు.” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.






