Mana Enadu : లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ (GST) తొలగింపు సహా పలు అంశాలే ఎజెండాగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (GST Council meeting) శనివారం ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitharaman) నేతృత్వంలో 55వ కౌన్సిల్ జరుగుతోంది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో పలు వస్తువులపై రేట్ల హేతుబద్ధీకరణ, శ్లాబుల మార్పు వంటి అంశాలపై చర్చిస్తున్నారు.
అయితే జీవిత బీమా, ఆరోగ్య బీమా (Health Insurance)పై జీఎస్టీ తొలగింపు అంశాన్ని మండలి మరోసారి వాయిదా వేసింది. దీనిపై మరింత పరిశీలన అవసరం అని మండలి అభిప్రాయపడినట్లు సమాచారం. దీంతో సామాన్యులకు మరోసారి నిరాశే ఎదురైనట్లైంది. హైల్త్, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ (Life Insurance) పాలసీలపై జీఎస్టీ మినహాయించాలని ఎన్నో రోజుల నుంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దీనిపై ఏర్పాటైన మంత్రుల బృందం నవంబరులో చర్చించి జీఎస్టీ తొలగించాలని నిర్ణయించింది.
తాజాగా భేటీ అయిన జీఎస్టీ కౌన్సిల్ (GST Council Meeting) సమావేశం ఆరంభంలోనే ఈ విషయంపై చర్చించి .. ఈ అంశాన్ని వాయిదా వేసింది. దీనిపై మరింత లోతైన చర్చ అవసరమని పలువురు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అందువల్లే దీనిపై నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు మంత్రుల బృందానికి నేతృత్వం వహించిన బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరి తెలిపారు.






