ఖద్దరును, ఖాకీని సమాజం నిశితంగా గమనిస్తోంది : సీఎం రేవంత్

Mana Enadu : తెలంగాణ అమరులైన పోలీస్ అధికారులందరికీ ప్రభుత్వం తరఫున ఘన నివాళులు ఆర్పిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. 140 కోట్ల దేశ జనాభా ప్రశాంతంగా ఉంటున్నారు అంటే పోలీసులు కారణమని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి వైపు నడవాలంటే పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు. నిరుద్యోగుల సమస్య, శాంతి భద్రత లేని రాష్ట్రం ఉంటే పెట్టుబడులు రావని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి పాటు పడుతున్న పోలీసులకు అభినందనలు తెలియజేశారు.

అమరులైన పోలీసు కుటుంబాలకు అండగా సర్కార్

హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో పోలీసు సంస్మరణ కార్యక్రమాని(police martyrs day)కి సీఎం రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరులైన పోలీస్ అధికారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. విధి నిర్వహణలో మరణించిన పోలీస్ అధికారులను గుర్తు చేసుకోవడం అందరికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. రాష్ట్రంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని.. డ్రగ్స్ మహమ్మారి యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆలయాలపై దాడులను సహించం

“పంజాబ్​లో మాదకద్రవ్యాల వినియోగం పెరిగి పోయింది. తెలంగాణ రాష్టంలో డ్రగ్స్(Telangana Drugs Cases)​ను పూర్తిగా నిర్మూలించడానికి టీజీన్యాబ్​ను ఏర్పాటు చేశాం. హైదరాబాద్​లో ఏఐ సాయంతో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆలయాలు, ప్రార్థనా మందిరాల మీద దాడులకు తెగబడే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి(Mutyalamma Temple Issue)పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసుల సాయంతో అన్ని పండుగలు ప్రశాంతంగా జరుపుకుంటున్నాం.” అని సీఎం రేవంత్ అన్నారు.

పోలీసు ఉద్యోగం గొప్ప బాధ్యత

పోలీసు సిబ్బంది పట్ల తనకు ప్రత్యేక అభిమానం ఉందని రేవంత్ అన్నారు. పోలీసులు, వారి కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించాలని.. విమర్శలకు అవకాశం ఇవ్వవద్దని సూచించారు. విధినిర్వహణలో పోలీసుల(Telangana Police)కు ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీసులు చేయి చాచకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. పోలీసు ఉద్యోగం గొప్ప బాధ్యత అని.. భావోద్వేగాలతో కూడిన ఉద్యోగమని పేర్కొన్నారు. శాంతిభద్రతల రక్షణలో పోలీసుల త్యాగాలు సమాజం గుర్తుంచుకుంటుందని.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండటమని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Share post:

లేటెస్ట్