
దేశంలో మళ్లీ కరోనా (Corona) కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఢిల్లీలో ఏకంగా ఒకే రోజు 23 కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాజాగా దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కొత్త రకం కరోనా వేరియంట్లను గుర్తించినట్లు ఇండియన్ సార్స్ కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం శనివారం తెలిపింది. ఎన్ బీ. 1.8.1, ఎల్ఎఫ్ .7 కరోనా వేరియంట్లను గుర్తించినట్లు పేర్కొంది. ఈ కేసులు ఏప్రిల్ లో తమిళనాడు, గుజరాత్ లలో నమోదయ్యాయి.
ఢిల్లీలో ఒకే రోజు 23 మందికి వైరస్
మూడేళ్ల తర్వాత తొలిసారి ఢిల్లీలో 23 మందికి వైరస్ సోకింది. దీంతో అక్కడి ప్రభుత్వం (Delhi Government) ఆసుపత్రులను అప్రమత్తం చేసింది. కేసులు నమోదవుతున్నప్పటికీ.. తీవ్రత తక్కువేనని ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొనడం కాస్త ఊరట నిచ్చే విషయం. అయినా కచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందేనని అంటున్నారు. కొత్త వేరియంట్ వల్ల ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని అందరూ భయపడుతున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.
ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తం..
ఈ మధ్య కాలంలో ఆసియా దేశాల్లో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. చైనా, హాంకాంగ్, సింగపూర్, థాయ్ లాండ్ (Thailand) దేశాల్లో వేల సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. వైరస్ వ్యాప్తికి జేఎన్ 1 వేరియంట్ కారణమని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, నీరసం, తలనొప్పి ఉంటుండగా బాధితులు నాలుగు రోజుల లోపు కోలుకుంటున్నారని పేర్కొంది. ఢిల్లీలో పెరుగుతున్న కేసులతో బీజేపీ సర్కార్ అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు (Oxygen Cylinders) టెస్టింగ్ కిట్స్, వ్యాక్సిన్ల ను అందుబాటులో ఉంచుకోవాలని ముందస్తు సూచనలు చేసింది.