
ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భరోసా ఇవ్వలేని ఏకీకృత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వ్యతిరేకిస్తూ.. మార్చి 2న ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధ భేరీ మోగించనున్నామని సిపిఎస్ఇయు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ ప్రకటించారు. యుద్ధభేరి సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలోని పలు పాఠశాలలు,ప్రభుత్వ కార్యాలయాలలో యుద్దభేరి గోడపత్రికలు ఆవిష్కరించారు.పాత పెన్షన్ ను పునరుద్ధరించడం మినహా మరే ఇతర విధానాలు ఉద్యోగి హక్కులను కాపాడలేవని, సామాజిక భద్రతను కల్పించలేవని ఆయన స్పష్టం చేశారు.పాత పెన్షన్ పునరుద్ధరణ అనే ఏకైక లక్ష్యంతో మహా ఉద్యమాన్ని నిర్మించనున్నట్టు ఆయన తెలియజేశారు. రానున్న రోజుల్లో పాత పెన్షన్ సాధన కోసం చేసే ఉద్యమానికి ఈ యుద్ధభేరి మొదటి అడుగని ఆయన స్పష్టం చేశారు.
హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని.. ఆయన డిమాండ్ చేశారు, 2004లో నూతన పెన్షన్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత … సి పి ఎస్ ఈ యు దేశవ్యాప్తంగా చేసిన ఉద్యమాల ఫలితంగా అనేక రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానం పునరుద్ధరించబడింది. అదేవిధంగా తెలంగాణలో కూడా నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
యుద్దం ఆరంభమే..
హైదరాబాద్ ధర్నా చౌక్ లో మార్చి రెండున తలపెట్టిన యుద్ధభేరి కార్యక్రమం మలిదశ పెన్షన్ పోరాటానికి ఆరంభం మాత్రమేనని శశిధర్ అన్నారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ పాత పెన్షన్ పునరుద్ధరించుకుంటామని స్పష్టం చేశారు..
ఉద్యోగ,ఉపాధ్యాయుల నుండి అనూహ్యస్పందన
పాత పెన్షన్ సాధనా పోరాటం పై ఉద్యోగ, ఉపాధ్యాయుల నుండి అనూహ్యస్పందన వస్తుంది. ప్రతి విభాగంలోనూ ఉద్యోగ వర్గం నూతన పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు… ఏకీకృత పెన్షన్ విధానం ఎంత మాత్రమూ సముచితం కాదని, ఇది ఉద్యోగుల హక్కులను కాలరాయడమేనని ఉద్యోగ,ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాగి సురేష్, జిల్లా కోశాధికారి గుగులోత్ మోహన్ ,జిల్లా ఈసీ సభ్యులు కమటం నాగేశ్వరరావు,సురేష్ తదితరులు పాల్గొన్నారు.