
సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. ఉదయం 7 దాటిందంటే చాలు మాడ పగిలిపోతోంది. దీంతో జనం రోడ్లమీదకు రావాలంటేనే జంకుతున్నారు. ఓ వైపు ఆఫీసులకు వెళ్లే సమయం కావడం.. మరోవైపు హైదరాబాద్ రోడ్లుపై భారీ ట్రాఫిక్(Heavy traffic on Hyderabad roads).. పైనుంచి భానుడి భగభగలు వెరసీ సగటు నగరవాసి వేడిమి(Heat), చెమట(Sweat)తో తడిసిపోతున్నాడు. కార్లున్న వారి సంగతి సరే.. కానీ టూ వీలర్ ప్రయాణికుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంటోంది. పోనీ సొంత బైకును ఇంట్లో పెట్టేసి ఏ ర్యాపిడోలోనో, ఉబర్‌ల్లోనో వెళ్దామనుకుంటే కిక్కిరిసిపోయేంత ట్రాఫిక్. దీంతో నగరవాసులు మెట్రో(Metro Trains)ను ఆశ్రయిస్తున్నారు.
అందువల్లే భారీ డిమాండ్
మామూలుగానే మెట్రో రైళ్లు(Metro Trains) రద్దీగా ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలం, ఎండాకాలం(Summer)లో మెట్రో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ద్విచక్రవాహనాల్లో విధులకు వెళితే వర్షాకాలంలో తడిసిముద్దవుతారు. అదే ఎండాకాలంలోనూ చెమటతో తడిసి ముద్దవుతున్నారు. ట్రాఫిక్(Traffic)లో గంటల పాటు వాహనంపై వెయిట్ చేయాలన్నా సాధ్యపడటం లేదు. మధ్యలో ఆగే అవకాశం కూడా లేకపోవడంతో నీరు తాగేందుకు కూడా అవకాశం దొరకడం లేదని వాపోతున్నారు. అందుకే మెట్రో రైళ్లకు గత కొద్ది రోజుల నుంచి డిమాండ్ పెరిగిందని మెట్రో అధికారులు చెబుతున్నారు.
ఆ రూట్లో రైళ్ల సంఖ్యను పెంచాలని వినతి
ఉదయం ఏడుగంటల నుంచే మెట్రో రైళ్లన్నీ ప్రయాణికుల(Passengers)తో రద్దీగా మారుతున్నాయి. కార్లలో వెళ్లే వారు సైతం మెట్రో రైలులో ఏసీ ఉండటంతో ప్రయాణం సుఖంగా ఉందని భావించి ఇటువైపు మళ్లారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మార్చి నెలలో మెట్రో ఆదాయం(Metro Income) పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. కిక్కిరిసి పోయి ఉండటంతో అదనపు బోగీలు కానీ, అదనపు రైళ్ల(Extra Trains)ను కానీ వేయాలన్న డిమాండ్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా నాగోల్ టు రాయదుర్గం రూట్లో మెట్రో రైళ్ల సంఖ్యను పెంచాలన్న డిమాండ్ ఊపందుకుంది.