
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal), సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మ (Dhanashree Verma) విడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా వారికి ముంబయి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే విడాకుల అనంతరం ధనశ్రీ తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా ఓ ఆల్బమ్ రిలీజ్ చేసింది. ‘దేఖా జీ దేఖా మైనే’ అంటూ గృహహింస బాధితురాలిగా.. ఆమె భర్త చేతిలో మోసపోయిన మహిళగా ధనశ్రీ ఈ పాటలో కనిపించారు.
విడాకులైన రోజే గృహహింసపై పాట
టీ సిరీస్ నిర్మాణంలో విడుదలైన ఈ పాటను జ్యోతి నూరన్ పాడారు. ఈ పాటలో ఇష్వాక్, ధన శ్రీ భార్యాభర్తలుగా నటించారు. భర్తను ఎంతగానో ఇష్టపడ్డా.. అతడు వేరే అమ్మాయితో రిలేషన్‌లో ఉండటం ఈ వీడియోలో కనిపించింది. ఇక ఆమె ప్రశ్నించగానే అతడు దాడికి పాల్పడటం.. ఇదంతా భరించలేక చివరకు ఆమె విడాకులు తీసుకోవడం వంటి సీన్స్ తో ఈ పాటను రూపొందించారు. రియల్ లైఫ్ లో విడాకులు తీసుకున్న రోజే ధనశ్రీ ఈ పాట రిలీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఏడాదికే విడివిడిగా
చాహల్, ధనశ్రీ 2020 డిసెంబరులో వివాహం చేసుకున్నారు. ఇటీవల ధనశ్రీ తన పేరు నుంచి చాహల్ పేరును తొలగించడం, సోషల్ మీడియాలో ఇద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేయడం, కలిసి ఉన్న ఫొటోలు డిలీట్ చేయడంతో ఈ జంట విడిపోతుందంటూ పుకార్లు మొదలయ్యాయి. ఆ తర్వాత ఈ ఇద్దరు నెట్టింట చేసే పోస్టులు ఈ పుకార్లకు మరింత బలాన్నిచ్చాయి. ఇక తాజాగా గురువారం రోజున ముంబయి కోర్టు వీరికి విడాకులు మంజూరు చేయడంతో ఈ విషయంపై అధికారిక ప్రకటన జారీ అయింది. అయితే 2020లో వివాహం చేసుకున్న ఈ జంట పెళ్లయిన ఏడాది నుంచే విడివిడిగా ఉన్నట్లు డివోర్స్ పిటిషన్ లో పేర్కొన్నట్లు సమాచారం.