టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), విక్టరీ వెంకటేష్ (Venkatesh) కాంబోలో వచ్చిన మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ తెలుగు చిత్రపరిశ్రమ చరిత్రలోనే ఓ కల్ట్ క్లాసిక్. ఈ సినిమాలోని డైలాగ్స్, పాటలు, ప్రతీ ఫ్రేమ్ బాపు గీసిన బొమ్మ అంత అందంగా ఉంటుంది. ఈ మూవీకి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ ఈ మూవీ టీవీల్లో వస్తే ఇంటిళ్లిపాది అలా టీవీకి అతుక్కుపోతుంటారు. ఫ్యామిలీ అంతటిని ఒకే చోటకు చేర్చే సినిమా ఇది.
పూలకుండీ సీన్ పాపులర్
ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (Seethamma Vakitlo Sirimalle Chettu) సినిమాలో వెంకటేష్ పెద్దోడు, మహేష్ బాబు చిన్నోడుగా నటించారు. అయితే వీళ్లిద్దరి మధ్య సీన్స్ కు బాగా పాపులారిటీ వచ్చింది. ముఖ్యంగా తమ చెల్లెలి పెళ్లి సమయంలో పూలకుండీని తన్నే సీన్ బాగా పాపులర్ అయింది. ‘అరేయ్ పూలకుండీని ఎందుకు తన్నావ్ రా?’ అంటూ వెంకీ మహేష్ ను అడిగే డైలాగ్ మరింత క్రేజ్ దక్కించుకుంది. ఇటీవల ఈ సినిమా రీ రిలీజ్ (SVSC Re Release) అయినప్పుడు కూడా ఈ చిత్రానికి భారీగా స్పందన వచ్చింది. ఏకంగా చాలా మంది ప్రేక్షకులు థియేటర్లలోకి పూలకుండీలు తెచ్చుకుని ఈ సీన్ వచ్చినప్పుడు తన్నిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
పూలకుండీ ఎందుకు తన్నాడు?
అయితే తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అందులో ఆయన చిన్నోడు పూలకుండీ (SVSC Poola Kundi Scene)ని ఎందుకు తన్నాడో వివరించారు. చెల్లెలి పెళ్లి సమయంలో రావు రమేష్ వెంకటేష్ ను అవమానిస్తాడు. దాంతో పెద్దోడు బాధపడుతూ ఓ మూలన కూర్చుంటాడు. అన్నను వెతుక్కుంటూ వచ్చిన చిన్నోడు చెల్లి వద్దకు రమ్మని బ్రతిమాలుతాడు. అయితే అందుకు పెద్దోడు నేను నీలా ఉండలేను. నాకు నటించడం రాదు. నువ్వెళ్లి నాటకాలు వేసుకో పో అంటాడు. అప్పుడే చిన్నోడు పూలకుండీని తన్నేస్తాడు. అయితే ఆ సమయంలో చిన్నోడు పూలకుండీని ఎందుకు తన్నాడనేది ఇప్పటికీ ఓ సస్పెన్స్.
సస్పెన్స్ వీడింది
దాని గురించి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) మాట్లాడుతూ.. “చిన్నోడికి తన అన్న పెద్దోడు అంటే చాలా ప్రేమ. అయితే పెద్దోడికి గెలవాలని తపన లేకపోవడం, కెరీర్ పై ఫోకస్ లేకపోవడంపై చిన్నోడికి కోపం ఉంటుంది. అది మాటల్లో చూపించలేక అప్పుడప్పుడు వస్తువులు విసిరేస్తూ చూపిస్తుంటాడు. అయితే మీరు గమనించి ఉంటే.. పూలకుండీ సీన్ కంటే ముందు వచ్చే ఓ సీన్ లో డైనింగ్ టేబుల్ మీద వస్తులు విసిరేస్తాడు. ఇక చెల్లి పెళ్లి సమయంలో వెంకటేష్ తనకేం పట్టనట్లు ఓ మూలన నిలబడి ఉండటం మహేష్ కు నచ్చదు. అందుకే వెళ్లి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో తనను నాటకాలు వేసుకోపో అనడంతో చిన్నోడికి కోపం వస్తుంది. పెద్దోడిపై ఉన్న ప్రేమ వల్ల అన్నను ఏం అనలేక ఆ కోపాన్ని అక్కడున్న పూలకుండీ తన్నేసి దానిపై చూపిస్తాడు. పూలకుండీని తన్నడం చిన్నోడు తన బాధను చూపించడమే.” అంటూ శ్రీకాంత్ అసలు సంగతి చెప్పారు.






