తెలంగాణలో ఇంటింటికి ఉచిత ఇంటర్​నెట్​

మన ఈనాడు:  కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇంటర్నెట్‌ సేవలు ఇవ్వాలనే అంశాన్ని కాంగ్రెస్‌ పరిశీలిస్తోందని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రెడ్డి, వైశ్య కార్పొరేషన్ల ఏర్పాటునూ పార్టీ పరిశీలిస్తోందన్నారు.పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు అదనంగా మూడు హామీలిచ్చేందుకు సమాలోచనలు చేస్తోందన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ నేతలను ఉద్దేశించి బేకార్‌గాళ్లంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ నేతలంతా తాము అనుభవిస్తున్న పదవులన్నీ కాంగ్రెస్‌ పార్టీ పెట్టిన భిక్షేనన్నది మరిచిపోవద్దన్నారు. ప్రవళికది ఆత్మహత్య కాదని, ప్రభుత్వం చేసిన హత్యగానే భావించాలన్నారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో నకిరేకల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వేముల వీరేశంతో కలిసి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఉచిత ఇంటర్‌నెట్‌ సౌకర్యం, రెడ్డి, వైశ్య కార్పొరేషన్ల ఏర్పాటుపై ఇటీవల ఢిల్లీలో జరిగిన మేనిఫెస్టో కమిటీ సమావేశంలో శ్రీధర్‌బాబుతో కలిసి సమాలోచనలు చేశామని, కొన్నిరోజుల్లో దీనిపై ఓ నిర్ణయానికి వస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీలనే పేర్లు మార్చి… అంకెలు పెంచి, సీఎం కేసీఆర్‌ కాపీ కొట్టాడని విమర్శించారు.

కాంగ్రెస్​ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో ప్రజల్లో వస్తున్న స్పందన చూసి పిట్టకథల కేటీఆర్‌ బెంబేలెత్తిపోయారని, ఆ స్థితిలో ఆయన ఏమాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. కాగా తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా 18న ములుగు జిల్లాలోని ప్రఖ్యాత రామప్ప దేవాలయ సందర్శనకు వస్తున్న రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ అదేరోజు మహిళా డిక్లరేషన్‌ను ప్రకటిస్తారని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కాంగ్రెస్‌ భూపాలపల్లి అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు, వేం నరేందర్‌రెడ్డితో కలిసి సోమవారం రామప్ప దేవాలయాన్ని సందర్శించిన సీతక్క హెలిప్యాడ్‌, రామాంజపురం వద్ద నిర్వహించే బహిరంగ సభ స్థలాలను పరిశీలించారు. ఆ తర్వాత ములుగులో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. హుస్నాబాద్‌ సభలో కేసీఆర్‌ ఊసరవెల్లిలా మాట్లాడారని, కాంగ్రెస్‌ మేనిఫెస్టోను కాపీ కొట్టారని వారు దుయ్యబట్టారు.

Share post:

లేటెస్ట్