Mana Enadu : ‘మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరం’ అని పదే పదే చెబుతున్నా.. ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా.. ఎన్ని యాడ్స్ రూపొందిస్తున్నా.. మందుబాబుల తీరు మాత్రం మారడం లేదు. మందేసి వాహనం నడుపుతూ వారు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోడవమే కాకుండా.. ఎదుటివారి ప్రాణాలూ తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డ్రింక్ చేసి డ్రైవ్ (Drunk And Drive) చేస్తున్న వారిపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ చేస్తూ మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారి వాహనాలు సీజ్ చేస్తున్నారు.
10వేల లైసెన్సులు రద్దు
రవాణా చట్టాలు కఠినతరం చేయడంతో డ్రైవింగ్ లైసెన్సులు (Driving License) కూడా రద్దు చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో రవాణా శాఖ రద్దు చేసిన డ్రైవింగ్ లైసెన్సులలో ఎక్కువగా మద్యం సేవించిన వారివే ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో రద్దయిన 15,209 లైసెన్సుల్లో 85 శాతం హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నమోదైన కేసులే ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపుగా 10 వేల లైసెన్సులను రవాణా శాఖ సస్పెండ్ చేసింది.
మూడుసార్లు పట్టుబడితే లైసెన్సు రద్దు
మద్యం సేవించి వాహనం నడుపుతూ ఒకే వ్యక్తి మూడు సార్లు పట్టుపడితే లైసెన్సును సస్పెండ్ (Driving License Cancel) చేసేందుకు పోలీసులు రవాణా శాఖకు సిఫార్సు చేస్తారన్న విషయం తెలిసిందే. డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని మరింత కట్టుదిట్టం చేసేందుకు డేటాబేస్‌ను ఆధునికీకరించేందుకు రవాణా శాఖ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మద్యం మత్తులో, ఓవర్ లోడ్‌తో, అధిక వేగంతో వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తి ఫొటో లేదా ఆధార్ నంబరు డేటాబేస్‌తో అనుసంధానం చేయనున్నారు.
ఒక్క క్లిక్ తో అన్ని వివరాలు
ఈ విధానంతో వాహన చోదకుడి డ్రైవింగ్ లైసెన్సు నంబరు, ఎక్కడ తీసుకుందన్న వివరాలు తనిఖీ అధికారుల నుంచి సంబంధిత రవాణా శాఖ కార్యాలయానికి ఫాస్ట్ గా చేరేలా చూస్తున్నారు. ఇలా చేస్తే డ్రైవింగ్ లైసెన్స్‌ల సస్పెన్షన్ ప్రక్రియను వేగంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.






