Mana Enadu : అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోరు రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఓటర్లను ఆకర్షించడానికి డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్(Kamala Harris), రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌లు హామీల వర్షం కురిపిస్తూ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ(America Economy) అంశం కీలకంగా మారింది. తాజాగా అసోసియేటెడ్ ప్రెస్ – సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ నిర్వహించిన సర్వేలో తమ ఆర్థిక వ్యవస్థ చాలా పేలవంగా ఉందని అమెరికా పౌరులు భావిస్తున్నట్లు తేలడం గమనార్హం.
వెనకంజలో ట్రంప్
అమెరికా ఆర్థిక వ్యవస్థ సరైన దిశలో ప్రయాణించడం లేదని.. సర్వేలో పాల్గొన్న ప్రతి పదిమందిలో ఏడుగురు ఓటర్లు దేశ ఆర్థిక వ్యవస్థ తప్పుడు దిశలో ప్రయాణిస్తుందని అభిప్రాయపడినట్లు సర్వే నివేదిక వెల్లడించింది. ఆరోగ్య సంరక్షణ, నేరాల కన్నా ఎకానమీయే ప్రధాన సమస్యగా పరిగణిస్తున్న ఓటర్లు.. దేశ ఆర్థిక వ్యవస్థను సమర్థంగా నడిపించే నాయకుడికే తమ సపోర్టు అని స్పష్టం చేసినట్లు తెలిపింది. అయితే ఈ విషయంలో కమలా హారిస్ కంటే డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వెనకబడినట్లు పేర్కొంది.
ఓటర్లు ఎవరి వైపు
ఇద్దరు ప్రధాన అభ్యర్థుల్లో బలమైన ఆర్థిక వ్యవస్థ కోసం ఏ ఒక్కరు కూడా తమ ప్రణాళికలను ఎలా అమలు చేస్తారో పూర్తిగా వివరించలేదని పౌరులు అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. కమలా హారిస్ తమ ప్రణాళికలన్నింటికీ పూర్తిగా బడ్జెట్(US Budget) నుంచే నిధులు సమకూరుస్తామని చెబుతుండగా.. ట్రంప్ తమ ప్రణాళికల కోసం ఒకవేళ అప్పు చేసినా, ఆ ఖర్చును భర్తీ చేయడానికి తగినంత వృద్ధి ఉంటుందని అంటున్నారు. సంపన్నులకు పన్ను మినహాయింపులు(Tax Exemptions) ఇవ్వడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని ట్రంప్ భావిస్తున్నారు. మరోవైపు ట్రంప్ ప్రవేశపెట్టదలచుకున్న సుంకాలు అమెరికాలో అధిక ధరలకు దారితీస్తాయని కమలా హెచ్చరిస్తున్నారు. మరి ఓటర్లు ఎవరి నిర్ణయానికి జై కొడతారో చూడాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.