ManaEnadu : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) మెగా వేలం నవంబరు రెండో వారంలో జరగనున్నట్లు సమాచారం. ఈసారి కూడా దుబాయ్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ (BCCI) ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే చెన్నై, దిల్లీ, కోల్‌కతా కూడా తమ రిటైన్ జాబితాలను సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రిటైన్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB Retain List 2025) తన లిస్టును సిద్ధం చేసినట్లు సమాచారం.
రిటెన్షన్ + రైట్ టు మ్యాచ్
ఈ లిస్టుపై అధికారికంగా ఫ్రాంచైజీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ ఇద్దరు స్టార్ క్రికెటర్లను ఆర్సీబీ విడుదల చేసినట్లు క్రికెట్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రిటైన్ చేసుకొనే సంఖ్యను బీసీసీఐ ఖరారు చేయాల్సి ఉండగా.. రిటెన్షన్ + రైట్ టు మ్యాచ్ ఆప్షన్‌తో కలిపి ఆరుగురిని తమ వద్ద ఉంచుకొనే వెసులుబాటు కల్పిస్తుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఆ ఐదుగురికి చోటు
ఐదుగురితో కూడిన రిటెన్షన్ లిస్ట్‌ను ఆర్సీబీ సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ లిస్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli), మహమ్మద్ సిరాజ్, యశ్ దయాళ్, రజత్ పటీదార్, విల్ జాక్స్ (Will Jacks)కు ఛాన్స్ దక్కనున్నట్లు క్రికెట్ వర్గాల టాక్. ఇక చాలా రోజులుగా వార్తలు వస్తున్నట్లే ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (Faf du Plessis)ను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024లో పెద్దగా రాణించకపోవడంతోపాటు 40 ఏళ్లకు వయసు చేరడంతో అతడి స్థానంలో యువ రక్తానికి జట్టు పగ్గాలు అప్పగించాలని ఆర్సీబీ భావిస్తోందట.
ఆ ముగ్గురు ఔట్
ఇక ఈ లిస్ట్ ప్రకారం.. గత సీజన్‌లో అత్యంత ఖరీదైన ప్లేయర్ అయిన గ్లెన్ మాక్స్‌వెల్(Glenn Maxwell)పై ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. అయితే రానున్న సీజన్లో అతడిపై వేటు పడినట్లు సమాచారం. మరోవైపు భారీ అంచనాలు పెట్టుకున్న కామెరూన్ గ్రీన్ (Cameron Green) కూడా ప్రభావం చూపకపోవడంతో గ్రీన్ కూడా ఈసారి ఔట్ అని టాక్ నడుస్తోంది. అలా ఆర్సీబీ ఈసారి ఈ ముగ్గురు స్టార్లను పక్కన పెట్టేసినట్లు అనధికార సమాచారం.