Mana Enadu : అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచార ఆరోపణలు, పోక్సో కేసు (POCSO Case)లో అరెస్టయిన ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) పోలీసు కస్టడీకి రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు అనుమతించింది. నాలుగు రోజుల పాటు కస్టడీ ఇస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే విచారణ సమయంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని.. అవసరమైతే న్యాయవాది సమక్షంలో విచారించాలని పోలీసులకు సూచించింది.
బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
ప్రస్తుతం జానీ మాస్టర్ (johnny master custody) చంచల్‌గూడ జైలులో ఉన్న విషయం తెలిసిందే. కోర్టు అనుమతి నేపథ్యంలో జానీ మాస్టర్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. ఈనెల 28 వరకు పోలీసులు ఆయన్ను ప్రశ్నించనున్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్ (Jani Master Bail Petition)పై విచారణ సోమవారానికి వాయిదా పడింది.
జానీ మాస్టర్ పై పోక్సో కేసు
జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపుల (Sexual Harassment)కు పాల్పడ్డాడంటూ ఇటీవల ఆయన అసిస్టెంట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 2019 నుంచి వేధిస్తున్నారని, షూటింగ్ కోసం ముంబయి వెళ్లినప్పుడు హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడని తెలిపింది. అయితే మైనర్గా ఉన్నప్పుడే తనపై అత్యాచారం (Rape) చేశాడని ఆమె ఆరోపించడంతో జానీ మాస్టర్పై పోక్సో కేసు నమోదైంది.
రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
ఇక ఇటీవల జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టు (Jani Master Remand Report)లో పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు. తన అసిస్టెంట్పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆయన అంగీకరించారని పోలీసులు వెల్లడించారు. దురుద్దేశంతోనే జానీ మాస్టర్ బాధితురాలిని అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిపారు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వివరించారు.