కిమ్ ‘చెత్త’ చేష్టలు.. సియోల్ లో మూతపడుతున్న ఎయిర్ పోర్టులు

Mana Enadu : గత కొంతకాలంగా ఉత్తరకొరియా, దక్షిణ కొరియాల మధ్య చెత్త బెలూన్ల వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. నార్త్ కొరియా సౌత్ కొరియావైపు పంపిస్తున్న చెత్త బెలూన్లను మొదట చిన్న సమస్యగానే భావించారు. కానీ రానురాను అది దక్షిణ కొరియాకు పెద్ద సంకటంగా మారింది. ముఖ్యంగా సౌత్ కొరియా విమానాలకు ముప్పుగా మారాయి ఈ చెత్త బెలూన్లు. వీటి కారణంగా జూన్‌ నుంచి సియోల్‌కు చెందిన రెండు విమానాశ్రయాల్లోని రన్‌వేలను పలుమార్లు మూసేయాల్సి వచ్చిందని సౌత్ కొరియా వెల్లడించింది.

“జూన్‌ 1 నుంచి ఇచియాన్‌, గింపో ఎయిర్‌ పోర్టుల్లో కొన్ని లేదా మొత్తం రన్‌వేలను దాదాపు 20 రోజుల్లో మూసివేయాల్సి వచ్చింది. ఆ సమయంలో టేకాఫ్‌లు, ల్యాండింగ్‌లు సమస్యాత్మకంగా మారాయి. మొత్తం 413 నిమిషాలు (ఆరు గంటలకు పైగా) తమ వైమానిక సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇక గింపో ఎయిర్‌పోర్టులో దేశీయ విమానాలను నడుపుతారు. ఉ.కొరియా చెత్త బెలూన్ల కారణంగా ల్యాండింగ్‌ ఆలస్యం, మార్గం మళ్లింపు భయాలతో అత్యధిక ఇంధనాన్ని విమనాలు తీసుకెళ్లాల్సి వస్తోంది.” అని ఆ దేశ డెమోక్రటిక్‌ పార్టీ సభ్యుడు యంగ్‌ బూ నామ్‌ తెలిపారు. ఇచియాన్‌ ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే ఎయిర్‌పోర్టుల్లో ఐదో స్థానంలో ఉంటుంది.

మే చివరివారం నుంచి ఉత్తరకొరియా వేల సంఖ్యలో చెత్త నింపిన బ్యాగ్‌లు కట్టిన బెలూన్లను దక్షిణ కొరియా గగనతలంలోకి వదులుతున్న విషయం తెలిసిందే. తాజాగా వీటి సంఖ్య 5,500 దాటేసింది. ఈ బెలూన్లలో ప్రచార కరపత్రాలు వంటివి ఉన్నాయని.. ఈ బుడగలు ఒక దేశాధ్యక్షుడి నివాస ప్రాంగణంలో కూడా కూలి సంచలనం సృష్టించాయని సియోల్ పేర్కొంది. ఈ చెత్త బ్యాగుల్లో వాడి పడేసిన ప్లాస్టిక్‌ బాటిళ్లు, బ్యాటరీలు, పాడైన షూలు, కాగితాలతో కూడిన చెత్త ఉందని సియోల్ అధికారులు తెలిపారు. కొన్ని బెలూన్లలో మురుగుమట్టి, జంతు విసర్జన కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

Share post:

లేటెస్ట్