Mana Enadu : వానాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు (Seasonal Diseases) చుట్టుముట్టేస్తుంటాయి. వైరల్ ఫీవర్స్, మలేరియా, గున్యా, టైఫాయిడ్, డెంగీ వంటి జ్వరాలు పీడిస్తుంటాయి. ముఖ్యంగా డెంగీ బారిన పడి ప్రమాదకర పరిస్థితుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. డెంగీ వచ్చిందంటే చాలు రక్తకణాల సంఖ్య పడిపోయి త్వరగా బలహీనులుగా మారిపోతున్నారు. ఇక రోగనిరోధక వ్యవస్థ (Immune System) పటిష్ఠంగా లేకపోతే డెంగీ నుంచి కోలుకోవడం కాస్త క్లిష్టంగా మారుతోంది. అయితే డెంగీ జ్వరం నుంచి కాస్త త్వరగా కోలుకునేందుకు మీ డైట్ లో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి డెంగీ నుంచి బయటపడేసే ఆ ఆహార పదార్థాలేంటో తెలుసుకుందామా..?
బొప్పాయి ఆకు రసం (Papaya Leaf Juice)
డెంగీ జ్వరం (Dengue Fever) వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఇచ్చే సలహా బొప్పాయి ఆకు రసం రోజులో కనీసం ఒక స్పూన్ అయినా తీసుకోవాలని. డెంగీ బాధితులు ఈ రసం తీసుకోవడం వల్ల ప్లేట్ లెట్స్ కౌంట్ మెరుగుపడుతుంది. మరోవైపు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
కివీ ఫ్రూట్ (Kiwifruit)
డెంగీ జ్వరం వచ్చిన వారిని పరామర్శించేందుకు వెళ్లే వారు తీసుకువెళ్లే పండ్లలో తప్పకుండా ఉండేది కివీ ఫ్రూట్. డెంగీ బాధితులు తీసుకునే ఆహారంలో కివీ ఫ్రూట్ తప్పకుండా ఉండాలని డాక్టర్లు కూడా చెబుతుంటారు. ఈ పండు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఎర్రరక్త కణాలు (Red Plate Lets) ఉత్పత్తికి తోడ్పడుతుంది.
కొబ్బరినీళ్లు (Coconut Water)
సాధారణంగానే కొబ్బరినీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు. ఇక జ్వరం (Fever) వచ్చినప్పుడు ఇవి ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. డెంగీ బారిన పడినప్పుడు శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. ఈ సమస్యకు సరైన పరిష్కారం కొబ్బరినీళ్లు. అందుకే డెంగీ పేషెంట్స్ కొబ్బరినీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తారు.
మేక పాలు (Goat Milk)
మేక పాలల్లో పుష్కలంగా ఉండే సెలెనియం రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే శరీరంలో వైరస్ వృద్ధి చెందకుండా నియంత్రిస్తుంది. అందుకే డెంగీ బాధితులకు మేక పాలు మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
వేప ఆకులు (neem leaf)
వేప ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలుంటాయన్న విషయం తెలిసిందే. ఇవి వైరస్‌ల వృద్ధిని, వ్యాప్తిని అరికట్టడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. డెంగీ చికిత్సలో ప్రకృతి సిద్ధమైన ఔషధంగా పని చేసే వేపాకులను రోజూ ఉదయాన్నే తినడం ద్వారా ప్రయోజనం ఉంటుంది.