
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన ఓబులాపురం మైనింగ్ కేసు(Obulapuram Mining Case)లో హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు(CBI Court) ఐదుగురిని దోషులుగా తేలుస్తూ ఈరోజు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఇందులో దోషులైన గాలి జనార్దన్ రెడ్డి (A2), ఆయన పీఏ అలీఖాన్ (A7), వి.డి.రాజగోపాల్ (A3), శ్రీనివాస్ రెడ్డి (A1)ని అధికారులు చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail)కు తరలించారు. కోర్టులోనే వైద్యులు వీరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్లారు.
కోర్టు ఆర్డర్ కాపీ లేటవడంతోనే ఆలస్యం
కాగా కోర్టు ఆర్డర్ కాపీ(Copy of court order) కోసం ఇప్పటి వరకూ వీరంతా కోర్టులోనే ఉండటం గమనార్హం. కోర్టు ఆర్డర్ కాపీ రావడంతో సీబీఐ కోర్ట్ నుంచి నేరుగా చంచలగూడ జైలుకు తరలించారు. దాదాపు 15 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ మంగళవారం కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ప్రధాన నిందితులకు ఏడేళ్ల జైలుతోపాటు రూ.10 వేల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Ex Minister Sabitha Indra Reddy), మాజీ IAS అధికారి కృపానందంకు క్లీన్ చిట్ ఇచ్చింది.