
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రపంచ దేశాలపై సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ట్రంప్ దెబ్బకు ఆసియా మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఇక మార్కెట్లు పతనం దిశగా సాగుతున్నాయని గ్రహించిన మదుపర్లు ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయడమే సేఫ్ అని భావిస్తున్నారు. ట్రంప్ హయాంలో ఆర్థిక మాంద్యం (Economic Recission) తప్పదని భావిస్తున్న ప్రపంచ దేశాల పలు బ్యాంకులు కూడా పసిడినే పెట్టుబడి సాధనంగా భావిస్తున్నాయి. ఈ క్రమంలో పుత్తడిని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. దీనివల్ల బంగారం రేట్లు అమాంతం ఆకాశానికి ఎగిశాయి.
ఆకాశాన్నంటిన పుత్తడి రేట్లు
ముఖ్యంగా బంగారాన్ని ఆభరణంగానే కాకుండా సంప్రదాయంలో భాగంగా భావించే భారతదేశంలో పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. గోల్డ్ రేట్లు (Gold Rate Today) ఇక్కడ రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే గరిష్ఠ ధరలను తాకి రికార్డు సృష్టించాయి. ఇక తాజాగా 24 క్యారెట్ల పసిడి రేట్లు దేశంలోని పలు నగరాల్లో భారీగా పెరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ (Hyderabad Gold Price), కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.93,380 వద్ద పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.85,600 వద్ద విక్రయిస్తున్నారు.
వెండి ధరలు పైపైకి
మరోవైపు బంగారంతో వెండి కూడా పోటీ పడుతోంది. ఇప్పటికే వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిని తాకి రికార్డు సృష్టించాయి. ఇక తాజాగా దేశంలో కిలో వెండి ధర బుధవారం రోజున రూ.1,03,000 ఉండగా, గురువారం నాటికి రూ.7000 పెరిగి రూ.1,10,000 వద్ద పలుకుతోంది. హైదరాబాద్ లో కిలో సిల్వర్ రేటు రూ.1,10,000గా ఉండగా.. విజయవాడలోనూ అదే ధర వద్ద విక్రయిస్తున్నారు. ఈ ధరలు చూసి బంగారం, వెండి కొనాలంటే వినియోగదారులు భయపడుతున్నారు. ఇప్పట్లో ఆభరణాలు కొనుగోలు చేసే పరిస్థితులు లేవని వాపోతున్నారు.