
క్రికెట్ అభిమానులకు సూపర్ న్యూస్.. ఇకపై IPL మ్యాచులను థియేటర్లలో చూడొచ్చు. అవునండీ బాబూ.. మీరు విన్నది నిజమే. ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ PVR INOX.. బీసీసీఐ(BCCI)తో తాజాగా ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు దేశంలోని 30కి పైగా నగరాల్లోని PVR ఐనాక్స్ సినిమా థియేటర్లలో ఇకపై IPL మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడవచ్చు. ఈ ప్రత్యేక ప్రసారాలు నిన్నటి నుంచే (మార్చి 22) ప్రారంభమయ్యాయి. ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుక(IPL Opening Ceremony)తో ఈ సందడి మొదలైంది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. కేవలం వారాంతాల్లో జరిగే మ్యాచ్‌లతో పాటు, ప్లేఆఫ్ మ్యాచ్‌లనే థియేటర్లలో లైవ్ ప్రసారం చేస్తారు.
ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతి
TVలో మ్యాచ్ చూడటం ఒక ఎత్తయితే, స్టేడియంలో ప్రత్యక్షంగా చూడటం మరో ఎత్తు. కానీ ఇప్పుడు ఏకంగా సినిమా థియేటర్(Theatre)లోనే క్రికెట్ మ్యాచ్ చూసే అవకాశం రావడంతో ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేవు. థియేటర్ లోపలికి వెళ్లగానే ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతి కలగడం ఖాయం. భారీ తెరపై ఆటగాళ్లు స్పష్టంగా కనిపిస్తారు. సౌండ్ సిస్టమ్(Sound System) అయితే స్టేడియంలో ఉన్నట్టే అనిపించింది. కూర్చున్న ప్రతి ఒక్కరూ తమ తమ జట్లకు మద్దతు తెలుపుతూ కేరింతలు కొడుతారు.
ప్రధాన నగరాలతో పాటు టైర్-2, టైర్-3 నగరాలలోనూ..
ఈ స్క్రీనింగ్‌లు సౌత్ఇండియాతో పాటు నార్త్ లోని మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు టైర్-2, టైర్-3 నగరాల్లో కూడా అందుబాటులో ఉండనున్నాయి. అయితే, ఒక్కో నగరం షెడ్యూల్ వేర్వేరుగా ఉండవచ్చని PVR ఐనాక్స్ తెలిపింది. మరిన్ని వివరాలు, షెడ్యూల్ కోసం పీవీఆర్ ఐనాక్స్ వెబ్‌సైట్ లేదా యాప్‌ను సంప్రదించాలని సంస్థ సూచించింది. దీంతో క్రికెట్ అభిమానులు ఇకపై తమ అభిమాన ఆటను థియేటర్లలో పెద్ద స్క్రీన్‌పై ఆస్వాదించవచ్చు.