Mana Enadu: భాద్రపదమాసంలో ఎటుచూసినా పచ్చదనమే(Greenery) కనిపిస్తుంది. ఆ ప్రకృతి(The Nature)లో తిరగడమే ఓ పండుగలా తోస్తుంది. సృష్టికి కారణమైన శక్తికి ప్రతిరూపంగా, ఆ వాతావరణం నిలుస్తుంది. ఆ శక్తిని తల్చుకుంటూ, తమ జీవితాలు ఎలాంటి ఆటంకాలూ లేకుండా ముందుకు సాగిపోవాలనుకుంటూ విఘ్నాధిపతి అయిన వినాయకుడి(Lord Ganesha)ని కొలుస్తుంటారు. అదే వినాయక చవితి. అయితే ఎంతో సంప్రదాయంగా నిర్వహించుకోవాల్సిన ఈ గణపతి పండగను పర్యావరణానికి ముప్పు(threat) వాటిల్లేలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్(POP)తో తయారు చేసిన వినాయకులను పూజిస్తూ ఉత్సవాలు జరుపుతున్నాం. ఒకప్పుడు ప్రకృతికి నష్టం జరగకుండా నదులు(rivers), వాగుల(streams)లోనూ దొరికే ఒండ్రుమట్టితో ఆ ఏకదంతుడి ప్రతిమను రూపొందించేవారు. అలాగే ఏకవింశతి పత్రపూజ పేరుతో 21 రకాల ఆకుల(21 types of leaves)తో గణపతిని కొలిచేవారు. ఇలా 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణేశుడిని పత్రితో సహా నిమజ్జనం చేసేవారు.
మట్టి విగ్రహాలు, పత్రాల వాడకం వెనక..
వినాయకుడి పూజ కోసం మట్టి విగ్రహం, పత్రాలు ఉపయోగించడం వెనక మరో కారణం కూడా ఉంది. ఒండ్రు మట్టి(alluvial clay)లోనూ, పత్రాలలోనూ ఔషధి గుణాలు ఉంటాయి. గణపతికి చేసే షోడశోపచార పూజలో భాగంగా మాటిమాటికీ ఈ విగ్రహాన్నీ, పత్రాలనూ తాకడం వల్ల వాటిలోని ఔషధతత్వం మనకి చేరుతుంది. పూజ ముగిసిన తర్వాత ఓ తొమ్మిది రోజుల పాటు ఆ విగ్రహాన్నీ, పత్రాలనూ ఇంట్లో ఉంచడం వల్ల చుట్టూ ఉన్న గాలిలోకి ఆ ఔషధి గుణాలు చేరతాయి. ఆ తర్వాత దగ్గరలో ఉన్న జలాశయాలలో కానీ, బావిలలోకానీ నిమజ్జనం చేసేవారు. ఈ 9 రోజుల క్రతువు వల్ల ఎక్కడా ఎలాంటి మలినము మిగలదని పండితులు చెబుతున్నారు.
ఇప్పటికైనా మేల్కొందాం..
ముఖ్యంగా వినాయకుడి పండగ సమయంలో ఎక్కువ వర్షాలు, వరదలు వస్తుంటాయి. అలాంటి సమయంలో తీరం వెంబడి మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల వరద పోటు తగ్గే అవకాశం ఉంటుందని పూర్వీకులు(Ancestors) భావించేవారు. పైగా ఈ కాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు(Insects) ఎక్కువగా ఉంటాయని అంటారు. నిమజ్జనంలో విడిచే పత్రితో నీరు కూడా క్రిమి రహితంగా మారిపోతుందని పెద్దల విశ్వాసం. అందుకే నిమజ్జనం చేసే ఆచారం ఉన్న దసరా, బతుకమ్మ పండుగలు కూడా వర్షరుతువులోనే వస్తాయంటున్నారు పండితులు(Scholars). ఇదండీ నిమజ్జనం వెనుక ఉన్న విశేషం. అందుకే వచ్చేసారికైనా సంబరాల కోసమో, ప్రతిష్టకోసమే భారీ రంగురంగుల విగ్రహాలను నీటిలో కలిపి దానిని కలుషితం చేయడం మానుకుందాం.. ప్రకృతిని పరిరక్షించే మట్టి గణపయ్యలనే పూజిద్దాం..