
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర(Medaram Sammakka-Saralamma Jathara) ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ జాతర. రెండేళ్లకు ఒకసారి అత్యంత వైభవంగా జరుగుతుంది. తెలంగాణ(Telangana)లోని ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, మేడారం గ్రామంలో జరిగే ఈ జాతరకు భక్తులు(Devotees) కోటికి పైగా తరలివస్తారు. ఈ వన దేవతలను దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సహా దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. రెండేళ్లకోసారి మేడారం మహా జాతర జరుగుతుండగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 12 నుంచి మేడారం మినీ జాతర(Medaram Mini Jathara) జరగనుంది. నాలుగు రోజులపాటు ఈ మినీ జాతర కొనసాగనుంది. మహా జాతర జరిగిన మరుసటి సంవత్సరం మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈనెల 12,13,14,15వ తేదీల్లో మినీ జాతర జరగనుంది.
ఇది ఆదివాసీల ఆచారం
మినీ మేడారంలో భాగంగా ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయలకు నెలవైన సమ్మక్క-సారలమ్మ మినీ జాతరకు వారం ముందు నుంచి గుడిమెలిగే(Gudimelige), మండమెలిగే(Mandamelige) పండగలు నిర్వహించడం ఆచారంగా వస్తోంది. నేడు (ఫిబ్రవరి 5) గుడిమెలిగే పండగను జరిపి తరకు (Medaram Jatara) అంకురార్పణ చేయనున్నారు. ఇవాళ వేకువజామునే.. గద్దెలను కడిగి పూజలు చేసి ముగ్గులు వేసిన పూజారులు.. డోలు వాయిద్యాలు హోరెత్తుండగా.. పసుపు కుంకుమలతో ఊరేగింపు చేపట్టారు.
దిష్టి తోరణాలు కట్టి.. నైవేద్యాలు సమర్పించి
మేడారం గ్రామం చుట్టూ దిష్టి తోరణాలు కట్టారు. ఇలా చేస్తే దుష్టశక్తులు తమ గ్రామాల్లోకి రావని వీరి విశ్వాసం. రాత్రి గద్దెల వద్ద అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించి పూజలు చేసి జాగారాలు చేయనున్నారు. ఇందుకోసం రాత్రి సమయంలో దర్శనాలను నిలిపివేయనున్నారు. వచ్చే బుధవారం(ఫిబ్రవరి 12) సాయంత్రం.. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపైకి తీసుకురావడంతో మినీ జాతర(Medaram Jatara) అంగరంగ వైభవంగా ప్రారంభమవనుంది.