ప్లాట్ విక్రయంలో మోసం జరిగిందని సినీ నటుడు, ఫేమస్ యాంకర్ సుమా కనకాల భర్త రాజీవ్ కనకాలకు (Rajeev Kanakala) హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అంబర్‌పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 421లోని ఒక వివాదాస్పద ప్లాటు విక్రయ వ్యవహారంలో మోసం జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో రాజీవ్‌ను విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. రాజీవ్ కనకాల ఈ ప్లాటును సినీ నిర్మాత గుత్తా విజయ్ చౌదరికి విక్రయించారు. కానీ ఈ ప్లాట్ రాజీవ్ కనకాల యాజమాన్యంలో లేదని తేలింది.
విచారణకు హాజరుకావాలని ఆదేశాలు
ఆ తర్వాత విజయ్ చౌదరి ఇదే ప్లాట్ ను డిండి శ్రవణ్ కుమార్ అనే వ్యక్తికి రూ.70 లక్షలకు అమ్మారు. అసలు లేని ప్లాట్ ను ఉన్నట్లు చూపించి మోసం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మోసం విషయం బయటకు రావడంతో హయత్‌నగర్ పోలీసులు గుత్తా విజయ్ చౌదరిపై కేసు నమోదు చేశారు. దీంతో సాక్షిగా పేర్కొంటూ రాజీవ్ కనకాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని కోరారు. అయితే, తన ఆరోగ్యం సరిగా లేదని, తర్వాత వస్తానని రాజీవ్ కనకాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.






