Mana Enadu : దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారికి రూ.5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ అందుబాటులోకి తీసుకొచ్చారు. ‘ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన’ (PMJAY) కింద ఈ పథకాన్ని ధన్వంతరి జయంతి (Dhanteras), తొమ్మిదో ఆయుర్వేద డే సందర్భంగా ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా ఆరు కోట్లమంది సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది.
ఆయుష్మాన్ కార్డు ఉన్న వృద్ధులకు కుటుంబ ప్రాతిపదికన ఏటా రూ.5 లక్షల వరకు లబ్ధి చేకూరనుంది. దీనికింద దరఖాస్తు చేసుకున్న వృద్ధులకు కొత్త కార్డులు అందించనున్నారు. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat) పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు రూ.5 లక్షల అదనపు కవరేజీ లభిస్తుండగా.. కుటుంబంలో 70 ఏళ్లు పైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం, సగం ప్రయోజనం వర్తించనుంది.
ఆయుష్మాన్ భారత్ ఎలా నమోదు చేసుకోవాలంటే?
- ఏబీపీఎంజేఏవై పథకంలో లబ్ధి పొందేందుకు పీఎంజేఏవై పోర్టల్ లేదా ఆయుష్మాన్ యాప్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- PMJAY పోర్టల్‌లో ‘యామ్ ఐ ఎలిజిబుల్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- beneficiary.nha.gov.in అనే వెబ్‌సైట్‌కి రీ డైరెక్ట్ అవుతారు.
- క్యాప్చా, మొబైల్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేసి కేవైసీ కోసం నమోదు చేసి ఆమోదం కోసం చూడాలి.
- ఆయుష్మాన్ కార్డు సిద్ధమైన తర్వాత అధికారిక ఆమోదం లభించిన వెంటనే బీమా కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- ఆధార్‌లో నమోదైన వయసు ఆధారంగా అప్లై చేసుకోవచ్చు.